హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో భారత్ షూటర్లు గర్జించారు. పోటీలకు వేదికైన హాంగ్జౌ దద్దరిల్లేలా పతకాలు కొల్లగొట్టారు. తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ స్వర్ణంతో మొదలైన పతక వేట ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. మనుభాకర్, రితమ్ సాంగ్వాన్తో కలిసి 25మీటర్ల పిస్టల్ టీమ్‌ఈవెంట్‌లో పసిడి కొల్లగొట్టిన ఇషా..హోరాహోరీగా సాగిన వ్యక్తిగత ఈవెంట్లో వెండి వెలుగులు విరజిమ్మింది. అరంగేట్రం ఆసియాగేమ్స్లోనే తన సత్తాచాటుతూ డబుల్ ధమాకాతో అదరగొట్టింది. ఒత్తిడిని అధిగమిస్తూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ పతకాలను ఒడిసిపట్టుకుంది. 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో ప్రపంచ రికార్డుతో సిఫ్ట్‌కౌర్ సమ్రా స్వర్ణంతో మెరువగా, అశి చౌక్సి కాంస్యం ఖాతాలో వేసుకుంది. 25మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో రజతం దక్కగా, పురుషుల స్కీట్‌లో అనంత్‌జీత్ వెండి ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఎనిమిది పతకాల్లో ఏడు షూటింగ్ నుంచే కావడం విశేషం. బాక్సింగ్‌లో తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది.
ఆసియా గేమ్స్‌లో తెలంగాణ షూటింగ్ సంచలనం ఇషాసింగ్ పతక గర్జన చేసింది. ఆడుతున్నది తొలి ఆసియాగేమ్స్ అయినా ఎక్కడా తొణుకు బెణుకు లేకుండా స్వర్ణం సహా రజతంతో తన గురికి తిరుగులేదని చాటిచెప్పింది. బుధవారం తొలుత జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్ టీమ్‌ఈవెంట్‌లో ఇషాసింగ్, మనుభాకర్, రితి సాంగ్వాన్తో కూడిన భారత త్రయం 1759 స్కోరుతో అగ్రస్థానంతో పసిడి పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. చైనా(1756), కొరియా(1742) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నాయి. అదే జోరు కొనసాగిస్తూ మహిళల 25మీటర్ల పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ తుదిపోరులో ఇషాసింగ్ 34 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకుంది. లు రుయి(చైనా, 38), యాంగ్ జిన్(కొరియా, 29) స్వర్ణ, కాంస్యం సాధించారు. ఆఖరి రౌండ్ వరకు చైనా షూటర్‌తో 18 ఏండ్ల ఇషా నువ్వానేనా అన్నట్లు తలపడింది. చైనా షూటర్ ఐదింటిలో ఒకసారి లక్ష్యానికి దూరం కొట్టగా, ఇషాసింగ్ మూడు సార్లు చేజార్చుకుంది. దీంతో తృటిలో పసిడి కోల్పోవాల్సి వచ్చింది.
సిఫ్ట్‌కౌర్ ధమాకా
భారత యువ షూటర్ సిఫ్ట్‌కౌర్ సమ్రా స్వర్ణం సహా రజతంతో దుమ్మురేపింది. మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో సిఫ్ట్‌కౌర్ 469.6 పాయింట్లతో సరికొత్త ప్రపంచ రికార్డుతో పసిడి ఒడిసిపట్టింది. ఆది నుంచి తనదైన జోరు కనబరిచిన కౌర్ ప్రత్యర్థులకు సవాలు విసురుతూ పసిడి దక్కించుకుంది. జాంగ్ క్యుయాన్(చైనా, 462.3), అశి చౌక్సి(భారత్, 451.9) రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల రైఫిల్ త్రీ పొజిషన్లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. అదే దూకుడు కొనసాగిస్తూ మహిళల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో సిఫ్ట్‌కౌర్ సమ్రా, అశి చౌక్సి, మానిని కౌశిక్‌తో కూడిన భారత త్రయం 1764 స్కోరుతో రజతాన్ని ముద్దాడింది.
షాట్గన్లోనూ హవా
రైఫిల్, పిస్టల్ ఈవెంట్ల వరకే పరిమితం కాకుండా భారత షూటర్లు షాట్గన్లోనూ తమ హవా కొనసాగించారు. పురుషుల స్కీట్ ఫైనల్స్‌లో అనంత్‌జీత్‌సింగ్ 58 స్కోరుతో రజత వెలుగులు విరజిమ్మాడు. చెక్కుచెదరని గురితో అనంత్ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుని రెండో స్థానంలో నిలిచాడు. అబ్దుల్లా(కువైట్, 60), నసిర్(ఖతార్, 46) స్వర్ణ, కాంస్యం దక్కించుకున్నారు. మరోవైపు పురుషుల స్కీట్ టీమ్‌ఈవెంట్‌లో అంగద్వీర్సింగ్, గుర్జ్యోత్సింగ్, అనంత్జీత్సింగ్తో కూడిన భారత బృందం 355 స్కోరుతో మూడో స్థానంతో కాంస్యం కైవసం చేసుకుంది.
సెయిలింగ్‌లో విష్ణు అదుర్స్
సెయిలింగ్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. పురుషుల డింగీ ఐఎల్సీఏ7 రేసులో విష్ణు శరవణన్ 34 స్కోరుతో కాంస్యం దక్కించుకున్నాడు. పాయింట్ తేడాతో విష్ణు రజతాన్ని చేజార్చుకున్నాడు. జున్హాన్ ర్యాన్(సింగపూర్), జెమిన్(కొరియా) స్వర్ణ, రజతం సొంతం చేసుకున్నారు.
క్వార్టర్స్‌లో నిఖత్ జరీన్
ఆసియాగేమ్స్‌లో తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో పదునైన పంచ్‌లు సంధిస్తున్నది. బుధవారం జరిగిన మహిళల 50కిలోల ప్రిక్వార్టర్స్ బౌట్లో నిఖత్ జరీన్ 5-0తో చొరాంగ్ బాక్(కొరియా)పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఈ ఇందూరు బాక్సర్..కొరియా బాక్సర్‌ను ఆటాడుకున్నది. కచ్చితమైన పంచ్‌లు కొడుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. తొలి రౌండ్ నుంచే పక్కా వ్యుహాన్ని అమలు చేసిన జరీన్ అనుకున్న ఫలితాన్ని సాధించింది. మరోవైపు 63.5 కిలోల ప్రిక్వార్టర్స్‌లో శివ తాపా 0-5తో అస్కత్ కుల్తేవ్(కిర్గిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. 92కిలోల బౌట్లో సంజీత్ 0-5తో లజిబెక ముల్లోజోనోవ్ చేతిలో ఓడాడు.
షెడ్యూల్
బ్యాడ్మింటన్: మహిళల టీమ్:
భారత్ X మంగోలియా-ఉ:6.30
వుషు: మహిళల 60కి స్వర్ణ పోరు
రోష్బినాదేవి-ఉ:7.10
షూటింగ్: పురుషుల 10మీ
ఎయిర్ పిస్టల్: ఉ: 9.00
పురుషుల స్కీట్ టీమ్: ఉ: 10.30
బాక్సింగ్: మహిళల 60కి:
జాస్మిన్ లంబోరియా-మ:12.00
పురుషుల 51కి: దీపక్-సా: 5.30.
పురుషుల 71కి: నిశాంత్‌దేవ్ సా.6.30
జిమ్నాస్టిక్స్: మహిళల వాల్ట్ ఫైనల్ (ప్రణతి నాయక్)- మ: 12.00
టెన్నిస్: పురుషుల డబుల్స్:మ.2.00
హాకీ: భారత్ X జపాన్-సా: 6.15
నోట్: దే-దేశం, స్వ-స్వర్ణం, ర- రజతం,కా-కాంస్యం, మొత్తం