న్యూఢిల్లీ: సుదీర్ఘ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) చరిత్రలో నూతన అధ్యాయం. దేశంలో మహిళా క్రికెట్‌కు మరింత వెన్నుదన్నుగా నిలుస్తూ బీసీసీఐ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లింగ అసమానతలకు ఫుల్స్టాప్ పెడుతూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు మ్యాచ్ ఫీజు ఇచ్చేందుకు సిద్ధమైంది. గురువారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ పేర్కొన్నాడు. దీంతో ఇక నుంచి బోర్డు నుంచి సెంట్రల్ కాంట్రాక్టు పొందిన మహిళా క్రికెటర్లు..పురుషులతో సమానంగా వేతనం అందుకోనున్నారు. ప్రస్తుత కాంట్రాక్టు ప్రకారం ఒక టెస్టుకు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షల చొప్పున పారితోషికం అందుకుంటున్న పురుష క్రికెటర్ల వలే మహిళలకూ దక్కనున్నాయి.
గతంలో ఇవి వరుసగా రూ.4 లక్షలు(టెస్టు), వన్డే, టీ20(రూ.లక్ష) ఉండేది. ఈ నిర్ణయంతో దేశంలో క్రికెట్‌కు మరింత ఆదరణ పెరుగుతుందని, ముఖ్యంగా మహిళా క్రికెట్‌కు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని బిన్నీ అన్నాడు. బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ ఈ నిర్ణయం భారత క్రికెట్లో నూతనాధ్యాయమని, ఇటువంటి కీలక నిర్ణయంలో సహకరించిన బోర్డు సహచరులకు, అపెక్స్ కౌన్సిల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ విధంగా లింగ వివక్షను రూపుమాపుతూ సమాన వేతనాలు అమలు చేసిన రెండో క్రికెట్ బోర్డుగా బీసీసీఐ రికార్డులకెక్కింది. న్యూజిలాండ్ ఈ ఏడాది ఆరంభంలో ప్లేయర్లకు సమాన వేతనాలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా బోర్డు కూడా ఈ దిశగా అడుగులు వేస్తున్నది. గత మూడేండ్లలో భారత పురుషుల జట్టు 21 టెస్టులు ఆడగా, మహిళల జట్టు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడింది.
ఇకపై మహిళలకు కూడా మరిన్ని మ్యాచ్‌లు ఏర్పాటు చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్నట్టు షా తెలిపారు. కాగా గత మూడేండ్లలో బోర్డు ఆదాయం రూ.6వేల కోట్లు పెరిగిందని, రాష్ట్ర సంఘాలకు అందించే వాటా కూడా ఆ దిశగా పెంచనున్నట్టు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపాడు. ధుమాల్ గతంలో బోర్డు కోశాధికారిగా వ్యవహరించాడు. బోర్డు నిర్ణయం మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయమని మాజీ క్రికెటర్లు మిథాలీ రాజ్, హర్భజన్‌సింగ్ వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం దేశంలో క్రికెట్ అభివృద్ధికి, ముఖ్యంగా మహిళా క్రికెట్ ఉన్నతికి దోహదం చేస్తుందన్నారు. భారత మహిళా క్రికెట్ జట్టు ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్‌ను గెలుచుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో రన్నరప్‌గా నిలిచి రజత పతకం సొంతం చేసుకుంది.
క్రికెట్లో సమానత్వాన్ని తీసుకురావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అసమానతకు చెక్‌పెడుతూ లింగ సమానత్వం కోసం అడుగులు పడటం బాగుంది. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది.
-సచిన్ టెండూల్కర్
మహిళల క్రికెట్ చరిత్రలో ఇది మరుపురాని రోజు. పురుషులతో సమాన వేతనం చెల్లించేందుకు నిర్ణయం తీసుకున్న బోర్డుకు కృతజ్ఞతలు
– హర్మన్‌ప్రీత్
భారత్‌లో మహిళా క్రికెటర్లకు ఇది శుభవార్త
– స్మృతి మందన