Engalnd Cricketer Josh Tongue : బంధువులు, సన్నిహితుల పిల్లల భవిష్యత్తును కొందరు ముందే ఊహిస్తారు. వాళ్ల ప్రతిభను గుర్తించి మీ వాడు, మీ అమ్మాయి పెద్దయ్యాక డాక్టర్ అవుతారు. లాయర్ అవుతారు అని జోస్యం చెప్తారు. అయితే.. అవి జరిగినప్పుడు చూద్దాం అని అనుకుంటారంతా. కానీ, ఇంగ్లండ్‌లో క్రికెటర్స్ ఆర్మ్ పబ్ నడిపై టిమ్ పైపర్(Tim Piper) ఊహించింది నిజమైంది. అతడు తన స్నేహితుడి కుమారుడు క్రికెటర్ అవుతాడని 14 ఏళ్ల కిందట పందెం కాశాడు. అతడు చెప్పినట్టే ఆ అబ్బాయి క్రికెట్ బ్యాట్ పట్టాడు. ఈ రోజు ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. దాంతో, పందెంలో గెలిచిన పైపర్‌కు రూ.50 లక్షలు దక్కాయి.
ఇంతకు క్రికెటర్ ఎవరంటే..? జోష్ టంగ్(Josh Tongue). 25 ఏళ్ల జోష్ ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టుకు ఎంపికయ్యాడు. దాంతో, ఇంగ్లండ్‌కు ఆడుతున్న 711వ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ‘అప్పుడు జోష్ ఏడాది వయసు పిల్లాడు. ఒకసారి నేను వెళ్లేసరికి అతను తండ్రితో కలిసి గార్డెన్లో ఆడుకుంటున్నాడు. రెండు, మూడేళ్లు వచ్చాక జోష్.. నెట్స్‌లో బంతిని విసరడం గమనించాను. అతను లెగ్ స్పిన్ బాగా వేయగలడని అనిపించింది. అప్పుడే నేను అతడిపై పందెం కాశాను. నా ఫ్రెండ్‌తో నీ కొడుకు పెద్దయ్యాక క్రికెటర్ అవుతాడని చెప్పాను. ఆ రోజు నేను ఊహించిందే ఇప్పుడు నిజమైంది’ అని పైపర్ వెల్లడించాడు.
జోష్ టంగ్
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్(Ashesh) టెస్టు సిరీస్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆటగాళ్ల కవ్వింపులు, మాటల యుద్ధం, హోరాహోరీ పోరాటాలకు వేదికైన యాషెస్ జూన్ 16న మొదల్వనుంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఈ సిరీస్ నెగ్గితే వరల్డ్ కప్ గెలిచినంత సంబురపడిపోతారు. ఈ ఏడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC 2023) తర్వాత యాషెస్ టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్టు చాంపియన్‌షిప్ జరగనుంది. 2021లో ఫైనల్ చేరిన భారత్ ఆఖరి మెట్టుపై భంగపడింది. న్యూజిలాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైంది. దాంతో, టీమిండియా ఈసారి కప్పు కొట్టాలనే కసితో ఉంది.