Eoin Morgan : వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు ఫేవరెట్ అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(Eoin Morgan) అన్నాడు. సొంతగడ్డపై ఆడనుండటంతో పాటు ఎన్నో అదనపు ప్రయోజనాలు టీమ్ఇండియాకు ఉన్నాయని తెలిపాడు. గత వరల్డ్ కప్ (2019)లో ఇంగ్లండ్‌ను విశ్వ విజేతగా నిలిపిన మోర్గాన్.. ‘ఈ సారి రోహిత్ సేన కప్పు సాధించేందుకు ప్రధాన పోటీదారు’ అని వెల్లడించాడు. అంతేకాదు భారత ప్లేయర్లపై మోర్గాన్ ప్రశంసలు కురిపించాడు.
‘రోహిత్ అద్భుతమైన నాయకుడు. సారథిగానే కాకుండా కీలక ప్లేయర్‌గా అతడు భారత జట్టుకు ఎంతో ముఖ్యం. అతడు జట్టును సమతూకంగా ఉంచుతాడు. అతడితో కలిసి ఆడిన చాలామందితో మాట్లాడా. వారందరి నుంచి ఒకే సమాధానం వచ్చింది. రోహిత్ పట్ల వారికున్న గౌరవం అర్థమైంది. నేను రోహిత్ సారథ్యానికి అభిమానిని. ప్లేయర్లందరికీ బాధ్యతలు అప్పగించడంలో అతడి శైలి భిన్నమైంది’ అని మోర్గాన్ పేర్కొన్నాడు. గొప్ప నాయకులకు ఉండాల్సిన అన్ని లక్షణాలు రోహిత్లో ఉన్నాయని హిట్‌మ్యాన్‌పై ప్రశంసలు కురిపించాడు.
12 ఏళ్ల తర్వాత భారత గడ్డపై జరుగనున్నప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ(virat kohli) కీలకమవుతాడని మోర్గాన్ వెల్లడించాడు. ‘ప్రస్తుత తరంలో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు. వరల్డ్ కప్ వంటి మెగాటోర్నీల్లో అతడి ఆటతీరు అమోఘం. విరాట్ తొందరగా సంతృప్తి పడే రకం కాదు. అతడిలో గెలువాలనే కసి ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. ప్రస్తుతం అతడు మంచి లయలో ఉన్నాడు. ప్రపంచ కప్‌లో విరాట్ మరింత మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయం. అతడు టీమిండియా అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రం’ అని మోర్గాన్ అన్నాడు. విరాట్ వ్యక్తిత్వానికి తాను వీరాభిమానినని మోర్గాన్ పేర్కొన్నాడు. మైదానం లోపల, బయట అతడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి’ అని మోర్గాన్ పేర్కొన్నాడు.