లండన్: రెండు దశాబ్దాల అంతర్జాతీయ క్రికెట్‌కు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం జేమ్స్ అండర్సన్ వీడ్కోలు ప్రకటించాడు. నాలుగు పదుల (41 ఏండ్లు) వయసులోనూ యువ పేసర్లకు దీటుగా బౌలింగ్ చేస్తున్న జిమ్మీ (అండర్సన్ ముద్దుపేరు) జులైలో వెస్టిండీస్‌తో లార్డ్స్ వేదికగా జరుగబోయే మొదటి టెస్టు తన కెరీర్లో చివరి మ్యాచ్ అని స్పష్టం చేశాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అండర్సన్ స్పందిస్తూ.. ‘చిన్ననాటి నుంచి నేను ఎంతో ఇష్టపడిన ఆటలో 20 ఏండ్ల పాటు నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం అద్భుతం. కానీ నేను వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా. నాలాగే ఇతరులూ వారి కలను సాకారం చేసుకోవడం చాలా గొప్ప ఫీలింగ్’ అని రాసుకొచ్చాడు.
ఈ సందర్భంగా అండర్సన్ తన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో పాటు సహచర ఆటగాళ్లకు కృతజ్ఞతలు తెలిపాడు. 2002లో వన్డే అరంగేట్రం చేసినా 2003లో జింబాబ్వేతో టెస్టు ద్వారా లార్డ్స్‌లోనే తన కెరీర్‌కు శ్రీకారం చుట్టిన అండర్సన్.. 21 ఏండ్ల తర్వాత అదే వేదికపై తన ఆఖరి మ్యాచ్ ఆడనుండటం గమనార్హం. సచిన్ (200 టెస్టులు) తర్వాత ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లు (187) ఆడిన ఇంగ్లండ్ దిగ్గజం.. 700 వికెట్లు పడగొట్టాడు. టెస్టులలో మురళీధరన్ (800), వార్న్ (708) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అతడే కాగా పేసర్లలో అతడిదే అగ్రస్థానం.