గువహతి : మహిళల వన్డే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ను బలమైన ప్రత్యర్థి అయిన దక్షిణాఫ్రికాపై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్‌లో పసికూన బంగ్లాదేశ్‌పై విజయానికి చెమటోడ్చాల్సి వచ్చింది. ఇరుజట్ల మధ్య గువహతి వేదికగా జరిగిన లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో బంగ్లా నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లిష్ జట్టు తంటాలుపడింది. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై బంగ్లా స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టారు. స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్.. 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మాజీ సారథి హీథర్ నైట్ (111 బంతుల్లో 79 నాటౌట్, 8 ఫోర్లు, 1 సిక్స్), అజేయ అర్ధశతకానికి తోడు కెప్టెన్ సీవర్ బ్రంట్ (32), చార్లి డీన్ (27*) సమయోచితంగా ఆడి ఇంగ్లండ్‌కు ఓటమి గండాన్ని తప్పించారు.
ఫహిమా (3/16) స్పిన్‌తో ఇంగ్లిష్ బ్యాటర్లను కట్టడిచేయగా యువ పేసర్ మరుఫా అక్తర్ (2/28) ప్రత్యర్థిని బెంబేలెత్తించింది. 78 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయిన దశలో గనుక బంగ్లా పట్టుబిగించి ఉంటే మ్యాచ్‌లో ఫలితం మరో విధంగా ఉండేది. ఇంగ్లండ్ స్కోరు 103/5 వద్ద అలీస్ క్యాప్సీ (20)ని ఔట్ చేసిన బంగ్లా.. మరింత ఒత్తిడి పెంచడంలో విఫలమైంది. డీన్‌తో కలిసి పట్టుదలగా ఆడిన నైట్.. ఇంగ్లండ్ గెలుపు లాంఛనాన్ని పూర్తిచేసింది. 13 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆమె ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించింది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 49.4 ఓవర్లలో 178 రన్స్‌కే ఆలౌటైంది. సొభానా మొస్తారి (108 బంతుల్లో 60, 8 ఫోర్లు), రబేయా ఖాన్ (43*) ఆ జట్టును ఆదుకున్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్లలో సోఫీ ఎకిల్స్టొన్ (3/24) మూడు వికెట్లు తీయగా చార్లి డీన్ (2/28), అలీస్ క్యాప్సీ (2/31) తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇది రెండో విజయం.