సౌతంప్టన్: కొద్దిరోజుల క్రితమే ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టుకు సారథిగా ఎంపికైన హ్యారీ బ్రూక్.. తన కెప్టెన్సీ ప్రయాణాన్ని వరుస సిరీస్ విజయాలతో ఆరంభించాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో ముగిసిన వన్డే సిరీస్‌ను 3-0తో గెలుచుకున్న బ్రూక్ సేన.. బుధవారం రాత్రి ముగిసిన టీ20 సిరీస్‌నూ 3-0తో కైవసం చేసుకుంది.
సౌతంప్టన్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 20 ఓవర్లలో 248/3 పరుగుల భారీ స్కోరు చేసింది. డకెట్ (84), జెమీ స్మిత్ (60) దంచికొట్టారు. ఛేదనలో విండీస్ 20 ఓవర్లకు 211/8 వద్దే ఆగిపోయింది. రోమన్ పావెల్ (79 నాటౌట్) పోరాడినా ఆ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. డకెట్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, బట్లర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.