సెయింట్ లూసియా: పొట్టి ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగినా వరుణుడి వరుస షాకులతో పాటు గ్రూపు దశలో ఆస్ట్రేలియా చేతిలో ఓడటంతో తదుపరి దశకు ముందంజ వేస్తుందా? లేదా? అన్న అనుమానాల నడుమ ఇంగ్లండ్ ఎట్టకేలకు సూపర్-8కు చేరింది. ఆస్ట్రేలియాతో ఆఖరి గ్రూప్ మ్యాచ్లో స్కాట్లాండ్ పోరాడి ఓడటంతో బట్లర్ సేనకు రూట్ క్లీయర్ అయింది. అంతకుముందు ఇంగ్లండ్.. వర్షం కారణంగా పది ఓవర్లే సాధ్యమయిన మ్యాచ్లో నమీబియాను ఓడించడంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది.
అంటిగ్వా వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 41 పరుగుల (డక్వర్త్ లూయిస్) తేడాతో నెగ్గింది. వర్షం కారణంగా 10 ఓవర్ల ఆటే సాధ్యమైన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లీష్ జట్టు.. హ్యారీ బ్రూక్ (47 నాటౌట్), బెయిర్ స్టో (31) బాదడంతో 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. నమీబియా 10 ఓవర్లలో 84/3 వద్దే ఆగిపోయింది. మైకెల్ వాన్ లింగెన్ (33) ధాటిగా ఆడినా ఆ జట్టును గెలిపించలేకపోయాడు.
సెయింట్ లూసియా లోని డారెన్ సామి అంతర్జాతీయ స్టేడియం వేదికగా స్కాట్లాండ్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో కంగారూలు 5 వికెట్ల తేడాతో నెగ్గారు. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్ముల్లెన్ (34 బంతుల్లో 60, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), బెర్రింగ్టన్ (31 బంతుల్లో 42 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) వేగంగా ఆడి భారీ స్కోరు సాధించారు.
ఛేదనలో ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. ట్రావిస్ హెడ్ (49 బంతుల్లో 68, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడినా వార్నర్ (1), మార్ష్ (8), మ్యాక్స్వెల్ (11) విఫలమయ్యారు. కానీ ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ మార్కస్ స్టోయినిస్ (29 బంతుల్లో 59, 9 ఫోర్లు, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో ఆసీస్ విజయతీరాలకు చేరింది. ఆఖర్లో స్కాట్లాండ్ బౌలర్లు కట్టడి చేసినా టిమ్ డేవిడ్ (29 నాటౌట్) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశాడు.