మాంచెస్టర్: పొట్టి క్రికెట్లో ఇంగ్లండ్ సంచలనం సృష్టించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మాంచెస్టర్‌లో జరిగిన రెండో పోరులో ఆ జట్టు 20 ఓవర్లలోనే ఏకంగా 304 పరుగులు చేసి రికార్డుల దుమ్ము దులిపింది. 50 ఓవర్లలోనే కష్టతరమైన ఈ స్కోరును ఇంగ్లిష్ బ్యాటర్లు బజ్‌బాల్ ఆటతో 120 బంతుల్లోనే దంచేశారు. పొట్టి ఫార్మాట్లో ఐసీసీ శాశ్వత సభ్యత్వం కల్గి ఉన్న దేశాల్లో ఇదే అత్యధిక స్కోరు (అంతకుముందు భారత్.. బంగ్లాదేశ్‌పై 297/6) కాగా ఓవరాల్‌గా మూడోవది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (60 బంతుల్లో 141 నాటౌట్, 15 ఫోర్లు, 8 సిక్సర్లు) రికార్డు శతకంతో రెచ్చిపోయి వీరబాదుడు బాదాడు.
జోస్ బట్లర్ (30 బంతుల్లో 83, 8 ఫోర్లు, 7 సిక్సర్లు)తో కలిసి సాల్ట్.. 7.5 ఓవర్లలోనే 126 రన్స్ జతచేశాడు. ఈ ఇద్దరూ పవర్ ప్లేలోనే వంద పరుగులు చేయగా 10 ఓవర్లకు ఇంగ్లండ్ 166/1, 12.1 ఓవర్లలో 200 దంచింది. టీ20లలో అత్యంత వేగంగా 200 రన్స్ చేయడం ఇదే మొదటిసారి. 39 బంతుల్లోనే సాల్ట్ శతకం పూర్తైంది. ఇంగ్లండ్ తరఫున టీ20లలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. సాల్ట్, బట్లర్ దంచుడుకు రబాడా (4 ఓవర్లలో 70), యాన్సెన్ (60) వంటి ప్రపంచ స్థాయి బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అదీగాక టీ20ల్లో ఇంగ్లండ్ నుంచి అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదుచేసిన బ్యాటర్‌గానూ సాల్ట్ రికార్డులకెక్కాడు.
ఈ ఫార్మాట్లో అతడికిది నాలుగో సెంచరీ. ఇంగ్లండ్ బ్యాటర్లు ఏకంగా 30 బౌండరీలు, 18 సిక్సర్లు బాదగా.. ఆ జట్టు ఫోర్లు, సిక్స్‌ల రూపంలోనే 228 రన్స్ రాబట్టడం గమనార్హం. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో 158 రన్స్‌కే చేతులెత్తేసింది. కెప్టెన్ మార్క్మ్ (41) టాప్ స్కోరర్. దీంతో ఇంగ్లండ్ 146 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. పరుగులపరంగా ఇంగ్లండ్‌కు ఇదే అతిపెద్ద గెలుపు కాగా సఫారీలకు ఇదే అతిపెద్ద ఓటమి. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1-1తో సమం చేయగా మూడో టీ20
ఆదివారం జరుగనుంది.