పరుగుల వరద పారిన నాటింగ్‌హామ్ టీ20 మ్యాచ్‌లో భారత్‌పై ఇంగ్లండ్‌ది పైచేయి అయ్యింది. తొలుత మలన్, లివింగ్‌స్టోన్ వీరవిహారంతో ఇంగ్లండ్ భారీ స్కోరు
అందుకుంది. రిజర్వ్ బలగంతో బరిలోకి దిగిన భారత్.. ఇంగ్లిష్ బ్యాటర్లను కట్టడి చేయలేక
పోయింది. లక్ష్యఛేదనలో టీమ్ఇండియాకు సరైన శుభారంభం దక్కలేదు. గెలుపుపై ఆశలు అడుగంటిన వేళ సూర్యకుమార్ యాదవ్ తాను ఉన్నానంటూ పరుగుల మోత మోగించాడు. ఇంగ్లండ్ బౌలర్లను దంచుతూ తొలి సెంచరీతో కదంతొక్కాడు. సహచరుల సహకారం
కరువైన వేళ సూర్య ఒంటరిపోరాటం జట్టును గెలిపించలేకపోయింది.
నాటింగ్‌హామ్: భారత్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో రోహిత్‌సేన 17 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 216 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. ఓపెనర్ రిషబ్ పంత్(1) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. ఫామ్‌లేమితో నానా తంటాలు పడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(11) మరోమారు ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచాడు.
కుదురుకుంటున్న తరుణంలో రోహిత్ ఔట్ కావడంతో జట్టు మళ్లీ ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో శ్రేయాస్ అయ్యర్(28)తో కలిసి సూర్యకుమార్ సమయోచితంగా ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఎదురైన బౌలర్‌నల్లా బాదుతూ తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలి సెంచరీని సూర్య నమోదు చేసుకున్నాడు. ఆఖర్లో గెలుపుపై ఆశలు రేగినా.. దినేశ్ కార్తీక్(6), జడేజా(7) విఫలం కావడం కొంప ముంచింది. టోప్లె(3/22) మూడు వికెట్లు తీశాడు. తొలుత డేవిడ్ మలన్(77), లివింగ్‌స్టోన్(42 నాటౌట్) బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 215/7 స్కోరు చేసింది. రవి బిష్ణోయ్(2/30), హర్షల్ పటేల్(2/35) రెండేసి వికెట్లు తీశారు. టోప్లెకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ దక్కాయి.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 215/7(మలన్ 77, లివింగ్‌స్టోన్ 42 నాటౌట్, రవి బిష్ణోయ్ 2/30, హర్షల్ పటేల్ 2/2/35), భారత్: 20 ఓవర్లలో 198/9 (సూర్యకుమార్ యాదవ్ 117, అయ్యర్ 28, టోప్లె 3/22, జోర్డాన్ 2/37)