పొట్టి ఫార్మాట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మన అమ్మాయిలు.. ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టులో దుమ్మురేపుతున్నారు.తొలి రోజే రికార్డు స్కోరు చేసి ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టిన టీమ్ఇండియా.. స్పిన్ బౌలింగ్‌తో ఇంగ్లిష్ టీమ్‌ను కకావికలం చేసింది. బ్యాట్‌తో రాణించిన దీప్తి.. బంతితో పాంచ్ పటాకా మోగించడంతో ఇంగ్లండ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హర్మన్‌ప్రీత్ బృందం విజయానికి చేరువైంది.
ముంబై: రెండేండ్ల తర్వాత బరిలోకి దిగిన టెస్టులో భారత మహిళల జట్టు అదరగొడుతున్నది. బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారీ స్కోరు చేసిన టీమ్ఇండియా.. బౌలింగ్‌లోనూ సత్తచాటి ఇంగ్లండ్‌ను ఓటమి అంచుల్లోకి నెట్టింది. ఓవర్‌నైట్ స్కోరు 410/7తో రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 18 పరుగులు జోడించి 428 పరుగులకు ఆలౌటైంది. దీప్తి శర్మ (67) రాణించింది. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫియా ఎకిల్‌స్టోన్, లారెన్ బెల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. 136 పరుగులకే కుప్పకూలింది. స్కీవర్ బ్రంట్ (59; 10 ఫోర్లు) అర్ధశతకం సాధించగా.. తక్కినవాళ్లంతా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు చేరారు. బ్యూమౌంట్ (10), సోఫియా (11), కెప్టెన్ హీథర్ నైట్ (11), డానీ వ్యాట్ (19), అమీ జోన్స్ (12), సోఫి ఎకిల్‌స్టోన్ (0), చార్లీ డీన్ (0) విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5.3 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టింది. ఒక దశలో 108/3తో పటిష్ట స్థితిలో కనిపించిన ఇంగ్లండ్,, దీప్తి బంతి అందుకున్న తర్వాత తీవ్రంగా ఇబ్బంది పడింది. పది పరుగుల తేడాలో ఆ జట్టు చివరి 6 వికెట్లు కోల్పోయింది. స్నేహ్ రాణా రెండు వికెట్లు తీసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (44 బ్యాటింగ్), షఫాలీ వర్మ (33), జెమీమా (27), స్మృతి మంధన (26) రాణించారు. ఇంగ్లిష్ బౌలర్లలో చార్లీ డీన్ 4, ఎకిల్‌స్టోన్ రెండు వికెట్లు పడగొట్టింది. చేతిలో మరో నాలుగు వికెట్లు ఉన్న భారత్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని ఇంగ్లండ్ కంటే.. 478 పరుగుల ఆధిక్యంలో ఉంది. సారథి హర్మన్‌తో పాటు పూజ వస్ర్తాకర్ (17) క్రీజులో ఉంది. ఆటకు మరో రెండు రోజుల గడువు ఉండటంతో ఇంగ్లిష్ జట్టు ముందు మనవాళ్లు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తారో చూడాలి. మొత్తంగా శుక్రవారం ఒక్కరోజే ఇరు జట్లు కలిపి 19 వికెట్లు పడగొట్టడం గమనార్హం.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 428 (సుభ 69, జెమీమా 68; లారెన్ బెల్ 3/67, సోఫియా 3/91), ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 136 (స్కీవర్ బ్రంట్ 59; దీప్తి 5/7, స్నేహ్ రాణా 2/25), భారత్ రెండో ఇన్నింగ్స్: 42 ఓవర్లలో 186/6 (హర్మన్‌ప్రీత్ 44 నాటౌట్, షఫాలీ 33; చార్లీ డీన్ 4/68).