మాంచెస్టర్ : ప్రతిష్టాత్మక అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్‌లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో మ్యాచ్ క్రమంగా భారత్ చేతుల్లోంచి జారిపోతున్నది. జీవం లేని పిచ్‌పై ఇంగ్లిష్ బ్యాటర్లు పరుగుల పండుగ చేసుకుంటుండంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ (248 బంతుల్లో 150, 14 ఫోర్లు) ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు క్రికెట్ దిగ్గజాల రికార్డులను తిరగరాస్తూ చిరస్మరణీయ శతకంతో కదం తొక్కడంతో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 544 పరుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (77 బ్యాటింగ్), ఒలీ పోప్ (71) రాణించడంతో ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 186 పరుగుల కీలక ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. రెండో రోజంత దూకుడు లేకపోయినా ఇంగ్లిష్ జట్టు నిలకడగా ఆడుతూ ఆధిపత్యాన్ని కొనసాగించింది. రెండో రోజు మాదిరిగానే భారత పేసర్లు మూడో రోజూ నిరాశపరిచారు. వాషింగ్టన్ సుందర్ (2/57) కీలక వికెట్లు తీయగా ఆఖర్లో జడేజా (2/117), బుమ్రా (1/95) మెరవడం ఒక్కటే మూడో రోజు భారత్‌కు ఊరట!
రెండో రోజు బజ్‌బాల్ దూకుడుతో అలరించిన ఇంగ్లండ్.. మూడో రోజు నిలకడగా ఆడింది. ఉదయం సెషన్లో రూట్, పోప్.. భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా జాగ్రత్తపడ్డారు. ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ గిల్.. పదేపదే బౌలర్లను మార్చినా ఫలితం శూన్యం. 22 పరుగుల వద్ద రూట్ రనౌట్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగా 63వ ఓవర్లో అన్శుల్ వేసిన ఓవర్లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ జురెల్ జారవిడవడంతో భారత్ కీలక అవకాశాలు నేలపాలయ్యాయి. ఈ ద్వయం అర్ధ శతకాల తర్వాత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసింది.
క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని లంచ్ విరామం తర్వాత ఎట్టకేలకు వాషింగ్టన్ విడదీయడంతో భారత ఆటగాళ్లలో కొంత జోష్ వచ్చింది. అతడు వేసిన 77వ ఓవర్లో పోప్.. స్లిప్స్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇవ్వగా రెండు ఓవర్ల తర్వాత బ్రూక్ (3) ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. కానీ స్టోక్స్ అండతో రూట్.. ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జడేజానే వేసిన ఓవర్లో బౌండరీతో 90లలోకి వచ్చిన రూట్.. అన్శుల్ 95వ ఓవర్లో బౌండరీతో టెస్టుల్లో 38వ శతకాన్ని నమోదుచేశాడు. కొత్త బంతి తీసుకున్నా భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో రూట్, స్టోక్స్ సునాయసంగా పరుగులు రాబట్టారు. టీ విరామానికి ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 75 రన్స్‌కు పెంచుకుంది. టీ తర్వాత ఈ జోడీ అదే జోరు కొనసాగించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు దిశగా పయనించింది. రూట్‌కు అండగా నిలబడ్డ స్టోక్స్.. వాషింగ్టన్ ఓవర్లో సింగిల్ తీసి 97 బంతుల్లో టెస్టుల్లో 36వ హాఫ్ సెంచరీని నమోదుచేశాడు. అయితే 66 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కాళ్లకు తిమ్మిర్లు రావడంతో అతడు రిటైర్డ్‌హర్ట్‌గా మైదానాన్ని వీడాడు.
మూడో సెషన్ డ్రింక్స్ విరామం తర్వాత టీమ్ఇండియాకు కలిసొచ్చింది. జడ్డూ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయిన రూట్.. స్టంపౌట్ అయ్యాడు. స్టోక్స్ స్థానంలో వచ్చిన స్మిత్ (9)ను బుమ్రా పెవిలియన్‌కు పంపాడు. సిరాజ్ బౌలింగ్‌లో వోక్స్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. స్టోక్స్ మళ్లీ వచ్చి డాసన్ (21*)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డాడు.
4 టెస్టుల్లో అత్యధిక శతకాలు చేసిన వారిలో రూట్‌ది నాలుగో స్థానం. సచిన్ (51), కలిస్ (45), పాంటింగ్ (41) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ (సాయి 61, జైస్వాల్ 58, స్టోక్స్ 5/72, ఆర్చర్ 3/73);
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 135 ఓవర్లలో 544/7 (రూట్ 150, డకెట్ 94, వాషింగ్టన్ 2/57, జడేజా 2/117)
ఆధునిక క్రికెట్ దిగ్గజాలలో ఒకడిగా వెలుగొందుతున్న రూట్ మూడో రోజు రికార్డుల దుమ్ముదులిపాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు దిగ్గజాల రికార్డులను చెరిపేసి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. మూడో రోజు వ్యక్తిగత స్కోరు 32 వద్ద అతడు.. టెస్టులలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో రాహుల్ ద్రవిడ్ (13,288), జాక్వస్ కలిస్ (13,289) రికార్డులను అధిగమించి థర్డ్ హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత శతకం సైతం పూర్తిచేసిన రూట్.. 120 పరుగుల వద్ద రికీ పాంటింగ్ (13,378) రికార్డునూ బ్రేక్ చేసి రెండో స్థానానికి దూసుకెళ్లాడు. టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (15,921) అగ్రస్థానంలో ఉన్నాడు. 2012లో టెస్టు అరంగేట్రం చేసిన రూట్.. ఇప్పటిదాకా 157 టెస్టులాడి 286 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను అందుకున్నాడు. అతడి ఖాతాలో 38 శతకాలు, 66 అర్ధశతకాలు ఉన్నాయి.