ఇండోర్ : స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ సెమీస్ రేసులో నిలవాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో గెలుపు అంచులదాకా వచ్చిన భారత జట్టు కీలక సమయంలో తడబడి టోర్నీలో హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఇండోర్ వేదికగా హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్.. టీమ్ఇండియాపై 4 పరుగుల స్వల్ప తేడాతో గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇంగ్లండ్ నిర్దేశించిన 289 పరుగుల ఛేదనలో ఒకదశలో పటిష్ట స్థితిలో నిలిచి విజయం వైపుగా సాగిన ఉమెన్ ఇన్ బ్లూ.. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో 284/6 వద్దే ఆగిపోయి సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. స్మృతి మంధాన (94 బంతుల్లో 88, 8 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (70 బంతుల్లో 70, 10 ఫోర్లు) రాణించినా.. దీప్తి శర్మ (4/51 (బ్యాట్‌తో 50) ఆల్‌రౌండ్ షో తో మెరిసినా అవి జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ హీథర్ నైట్ (91 బంతుల్లో 109, 15 ఫోర్లు, 1 సిక్స్) శతకానికి తోడు అమీ జోన్స్ (56) హాఫ్ సెంచరీతో నిర్ణీత ఓవర్లకు 288/8 సాధించింది. ఇక ఈ ఓటమితో భారత జట్టు సెమీస్ చేరాలంటే టోర్నీలో ఆడాల్సిన మిగిలిన రెండు మ్యాచ్‌లనూ తప్పక నెగ్గాల్సి ఉంటుంది.
ఈ టోర్నీ ఆరంభం నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయక విమర్శల పాలవుతున్న కెప్టెన్, వైస్ కెప్టెన్ ద్వయం (హర్మన్, స్మృతి) కీలక మ్యాచ్‌లో జూలు విదిల్చారు. ఛేదనలో 42 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో ఈ జోడీ కీలక ఇన్నింగ్స్ ఆడింది. క్రీజులో కుదురుకునే నెమ్మదిగా ఆడిన స్మృతి ఆ తర్వాత బ్యాట్‌కు పనిచెప్పింది. మరో ఎండ్‌లో హర్మన్ వేగంగా పరుగులు రాబట్టింది. ఈ జోడీ మూడో వికెట్‌కు 124 బంతుల్లో 125 రన్స్ జతచేసింది. కౌర్ నిష్క్రమించినా స్మతి, దీప్తి నిలకడగా ఇంగ్లిష్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. సెంచరీకి 12 రన్స్ దూరంలో మంధానను స్మిత్ ఔట్ చేయడంతో 67 పరుగుల ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఈ క్రమంలో రిచా, దీప్తి ఔట్ అవడంతో భారత్ ఒత్తిడికి లోనైంది. ఆఖరి 3 ఓవర్లలో 27 పరుగులు అవసరమగా క్రీజులో ఉన్న అమన్‌జ్యోత్ (18*), స్నేహ్ రాణా (10*) వేగంగా ఆడటంలో తడబడ్డారు.
సంక్షిప్త స్కోర్లు : ఇంగ్లండ్: 50 ఓవర్లలో 288/8 (నైట్ 109, జోన్స్ 56, దీప్తి 4/51, చరణి 2/68);
భారత్: 50 ఓవర్లలో 284/6 (స్మృతి 88, హర్మన్ 70, సీవర్ 2/47, స్మిత్ 1/40)