ఓవల్ : లండన్‌లో ట్రాఫిక్ కష్టాలతో ఇంగ్లండ్, వెస్టిండీస్ క్రికెట్ స్టార్లకు వింత అనుభవం ఎదురైంది. ఇరు జట్ల మధ్య ది ఓవల్ వేదికగా జరిగిన మూడో వన్డేకు ముందు ట్రాఫిక్ కారణంగా టాస్ ఏకంగా 40 నిమిషాలు ఆలస్యమవడం గమనార్హం. వివరాల్లోకెళ్తే.. మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు హోటల్ నుంచి టీమ్ బస్సుల్లో స్టేడియానికి బయల్దేరారు.
అయితే ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఇంగ్లండ్ క్రికెటర్లు ఇక లాభం లేదనుకుని సైకిళ్ల సాయంతో అక్కడ్నుంచి బయటపడి మైదానానికి చేరుకున్నారు. కానీ వెస్టిండీస్ ఆటగాళ్లు మాత్రం టీమ్‌బస్సులోనే ఉండిపోయారు. టాస్ సమయానికి కూడా విండీస్ ప్లేయర్లు మైదానానికి రాలేకపోవడంతో అంపైర్లు టాస్ సమయాన్ని 40 నిమిషాలు పొడిగించడం విశేషం. టాస్ ఆలస్యానికి తోడు వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు.