ఇంగ్లండ్ లక్ష్యం 371. టెస్టులలో.. అదీ ఆట ఐదో రోజు ఇంత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే అగ్రశ్రేణి జట్లు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాయి. కీలక సమయంలో వికెట్లు పడితే డ్రా వైపునకే మొగ్గుచూపుతాయి. కానీ నాలుగు రోజులుగా బ్యాటింగ్‌కు సహకరించిన పిచ్‌కు తోడు ‘బజ్‌బాల్’ ఆటతో దూసుకు పోతున్న ఇంగ్లండ్ మాత్రం గురి తప్పలేదు. మూడేండ్ల క్రితం బర్మింగ్‌హామ్‌లో భారత్‌పై సాధించిన రికార్డు విజయం (378) స్ఫూర్తితో హెడింగ్లీలోనూ దుమ్మురేపింది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. భారత్ దానిని కాపాడుకోలేక చతికిలపడింది. ఆఖరి రోజు ఏదైనా అద్భుతం జరుగకపోతుందా? అని ఆశించిన టీమ్ఇండియా అభిమానులను నిరాశకు గురిచేస్తూ తొలి టెస్టులో పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆఖరికి చివరిరోజు ఆటకు పలుమార్లు అంతరాయం కలిగించిన వరుణుడు సైతం మొహం చాటేయడంతో గిల్ సేనకు ఓటమి తప్పలేదు.
టెస్టుల్లో 2010 తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్ డకెట్. ఆ ఏడాది అలెస్టర్ కుక్.. మీర్పూర్ టెస్టులో ఫోర్త్ ఇన్నింగ్స్ సెంచరీ సాధించాడు.
టెస్టుల్లో ఇంగ్లండ్‌కు వారి సొంతగడ్డపై ఇది రెండో అత్యధిక ఛేదన. 2022లో ఆ జట్టు భారత్‌తోనే బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్టులో 378 పరుగుల ఛేదనను విజయవంతంగా పూర్తిచేసింది.
హెడింగ్లీ: ఇంగ్లండ్ పర్యటనను భారత జట్టు ఓటమితో ఆరంభించింది. దిగ్గజాల నిష్క్రమణ వేళ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న శుభ్‌మన్ గిల్.. తన నాయకత్వ ప్రయాణాన్ని అపజయంతో మొదలుపెట్టాడు. ప్రతిష్టాత్మక టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా లీడ్స్ (హెడింగ్లీ) వేదికగా ఐదు రోజుల పాటు ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌నే విజయం వరించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా నిర్దేశించిన 371 పరుగుల ఛేదనను బెన్ స్టోక్స్ సేన.. 82 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. ఓపెనర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బెన్ డకెట్ (170 బంతుల్లో 149, 21 ఫోర్లు, 1 సిక్స్), జాక్ క్రాలీ (126 బంతుల్లో 65, 7 ఫోర్లు) ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. జో రూట్ (53 నాటౌట్, 6 ఫోర్లు), జెమీ స్మిత్ (44 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) గెలుపు లాంఛనాన్ని పూర్తిచేశారు. ఆట ఆఖరి రోజు హెడింగ్లీ పిచ్ తొలి రెండు సెషన్ల పాటు బౌలర్లకు ఏమాత్రం సహకరించకపోగా భారత ఫీల్డర్లు కీలక క్యాచ్‌లు జారవిడవడం గిల్ సేన విజయవకాశాలను తీవ్రంగా దెబ్బతీసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ తలా రెండు వికెట్లు పడగొట్టగా బుమ్రాతో పాటు సిరాజ్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇక ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
భారీ లక్ష్యంతో ఐదో రోజు క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ ఓపెనర్లు తొలిసెషన్లో వికెట్‌ను జారవిడుచుకోవద్దనే పట్టుదలతో ఆడారు. తమ సహజసిద్ధ ఆటకు భిన్నంగా షాట్లకు పోకుండా డిఫెన్స్‌కే ప్రాధాన్యమివ్వడంతో ఆరంభంలో పరుగుల రాక కష్టమైంది. తొలి గంటల పాటు బుమ్రా, సిరాజ్.. ఇంగ్లండ్‌ను కట్టడిచేసినా వికెట్లు పడగొట్టలేకపోయారు. డకెట్ అడపాదడపా బౌండరీలతో అలరించినా క్రాలీ మాత్రం నిదానంగా ఆడాడు. డ్రింక్స్ తర్వాత డకెట్.. ప్రసిద్ధ్‌ను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు రాబట్టాడు. శార్దూల్ కూడా ప్రభావం చూపలేకపోయాడు. క్రీజులో కుదురుకున్నాక క్రాలీ సైతం స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ప్రసిద్ధ్ వేసిన 22వ ఓవర్లో సింగిల్ తీసిన డకెట్.. బ్యాక్ టు బ్యాక్ అర్ధ శతకాలను నమోదుచేశాడు. ఓపెనింగ్ ద్వయం నిలకడగా ఆడుతూ వంద పరుగుల భాగస్వామ్యాన్నీ పూర్తిచేసుకుంది. మొదటి సెషన్లో ఇంగ్లండ్.. 24 ఓవర్లలో 4 రన్‌రేట్‌తో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 96 పరుగులు చేసింది.
లంచ్ తర్వాత ఇంగ్లండ్ జోరు పెంచింది. బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌లో డకెట్ రెండేసి బౌండరీలతో 90లలోకి చేరాడు. సిరాజ్ ఓవర్లోనే సింగిల్‌తో క్రాలీ అర్ధ శతకం పూర్తయింది. జడేజా ఓవర్లో రెండు బౌండరీలు బాదిన డకెట్.. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిరాజ్ బౌలింగ్‌లో ఇచ్చిన క్యాచ్‌ను డీప్ బ్యాక్వర్డ్ స్కేర్ లెగ్ వద్ద జైస్వాల్ జారవిడిచాడు. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌కు ఇది నాలుగో డ్రాప్ క్యాచ్. ఆ మరుసటి ఓవర్లో డకెట్.. బౌండరీ సాయంతో టెస్టులలో ఆరో శతకాన్ని అందుకున్నాడు.
ప్రసిద్ధ్ భారత్‌కు తొలి బ్రేక్‌ను అందించాడు. అతడు వేసిన ఓవర్లో క్రాలీ.. స్లిప్స్‌లో రాహుల్ చేతికి చిక్కడంతో తొలి వికెట్ రికార్డు భాగస్వామ్యానికి (188) తెరపడింది. తన మరుసటి ఓవర్లో ప్రసిద్ధ్.. ఓలీ పోప్ (8)ను అద్భుత డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. పోప్ స్థానంలో వచ్చిన రూట్‌తో కలిసి డకెట్.. మూడో వికెట్‌కు 47 పరుగులు జతచేశాడు. అయితే డ్రింక్స్ విరామం తర్వాత బంతినందుకున్న శార్దూల్.. ఒకే ఓవర్లో ఇంగ్లండ్‌కు డబుల్ షాకులిచ్చాడు. 55వ ఓవర్ మూడో బంతికి డకెట్.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ నితీశ్ రెడ్డికి చేతికి చిక్కగా ఆ తర్వాతి బంతికే హ్యారీ బ్రూక్.. రిషభ్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.
టీ విరామం తర్వాత క్రీజులోకి వచ్చిన ఇంగ్లండ్ విజయానికి 102 పరుగులు అవసరమవగా.. కెప్టెన్ బెన్ స్టోక్స్, సీనియర్ బ్యాటర్ జో రూట్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. భారత ఫీల్దర్ల తప్పిదాలు వారికి కలిసొచ్చాయి. స్టోక్స్ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో రాహుల్ జారవిడిచినా..జడ్డూనే వేసిన తర్వాతి ఓవర్లో ఇంగ్లండ్ సారథి గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. కానీ రూట్.. యువ వికెట్ కీపర్ జెమీ స్మిత్‌తో కలిసి లాంఛనాన్ని పూర్తిచేశాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 465; భారత్ రెండో ఇన్నింగ్స్: 364; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 82 ఓవర్లలో 373/5 (డకెట్ 149, క్రాలీ 65, శార్దూల్ 2/51, ప్రసిద్ధ్ 2/92)