IND vs ENG | రాజ్‌కోట్: పొట్టి ఫార్మాట్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ భారత జోరుకు బ్రేక్ పడింది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి మూడోదీ గెలిచి సిరీస్‌ను పట్టేయాలన్న టీమ్ఇండియా ఆశలపై పర్యాటక జట్టు నీళ్లు చల్లింది. రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో భారత్‌ను 26 పరుగుల తేడాతో ఓడించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. 20 ఓవర్లకు 171/9 స్కోరు చేసింది.
బెన్ డకెట్ (28 బంతుల్లో 51, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), లివింగ్స్టన్ (24 బంతుల్లో 43, 1 ఫోర్, 5 సిక్సర్లు) రాణించారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (5/24) తన కెరీర్లో రెండో ఫైఫర్‌తో విజృంభించి ఇంగ్లండ్‌ను కట్టడి చేసినా ఛేదనలో భారత్ తడబాటుకు గురైంది. 20 ఓవర్లలో 145/9 పరుగులకే పరిమితమైంది. హార్దిక్ పాండ్యా (35 బంతుల్లో 40, 1 ఫోర్, 2 సిక్సర్లు), అభిషేక్ శర్మ (24) మినహా మిగిలినవారు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్ ఆరంభ ఓవర్లలో ఆడిన ఆటను చూస్తే ఆ జట్టు అవలీలగా 200 దాటుతుందేమో అనిపించింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫిల్ సాల్ట్ (5) నిరాశపరిచినా మరో ఓపెనర్ బెన్ డకెట్ మాత్రం దూకుడుగా ఆడాడు. షమీ 3వ ఓవర్లో కీపర్ మీదుగా భారీ సిక్సర్ కొట్టిన అతడు.. హార్దిక్ 4వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలు బాదాడు. ఆ తర్వాత వాషింగ్టన్ ఓవర్లో 4, 4,6తో 15 రన్స్ రాబట్టాడు.
డకెట్, బట్లర్ దూకుడుతో జోరు మీదున్న ఇంగ్లండ్ వరుణ్ రాకతో తడబడింది. 9వ ఓవర్ ఆఖరి బంతికి బట్లర్.. శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అతడు ఔట్ అవడానికి ముందు 83/1గా ఉన్న ఇంగ్లండ్.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో 15 ఓవర్లకు 115/6గా నిలిచింది. 26 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసిన డకెట్‌ను అక్షర్ 9వ ఓవర్లో చివరి బంతికి అతడిని పెవిలియన్‌కు పంపాడు. బ్రూక్ (8)ను బిష్ణోయ్ బౌల్డ్ చేయగా 14వ ఓవర్లో వరుణ్.. స్మిత్ (6), ఓవర్టన్ (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసి ఇంగ్లీష్ జట్టును కోలుకోని దెబ్బకొట్టాడు. ఆఖర్లో లివింగ్‌స్టొన్.. బిష్ణోయ్ 17వ ఓవర్లో 3 భారీ సిక్సర్లు బాదినా ఆ తర్వాతి ఓవర్లోనే హార్దిక్ అతడిని ఔట్ చేశాడు.
లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభం నుంచే తడబాటుకు గురైంది. ఈ సిరీస్‌లో షార్ట్ బంతులు ఆడలేక ఇబ్బందులు పడుతున్న శాంసన్ (3) మరోసారి అదే బలహీనతతో పెవిలియన్ చేరాడు. ఐదు బౌండరీలు బాదిన అభిషేక్.. కార్స్ 4వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి ఆర్చర్‌కు క్యాచ్ ఇచ్చాడు. 6, 4తో తన ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కెప్టెన్ సూర్య (14) మళ్లీ నిరాశపరిచాడు. భారత్ భారీ ఆశలు పెట్టుకున్న తిలక్ వర్మ (18)ను రషీద్ అద్భుత డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేయడంతో భారత్ కష్టాల్లో పడింది. వుడ్ 17వ ఓవర్లో 14 పరుగులు రాగా ఆర్చర్ 18వ ఓవర్లో 9 పరుగులే ఇచ్చి అక్షర్ వికెట్ తీశాడు. 19వ ఓవర్లో హార్దిక్ నిష్క్రమణతో భారత ఓటమి ఖరారైంది.
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 171/9 (డకెట్ 51, లివింగ్‌స్టొన్ 43, వరుణ్ 5/24, హార్దిక్ 2/33);
భారత్: 20 ఓవర్లలో 145/9 (హార్దిక్ 40, అభిషేక్ 24, ఓవర్టన్ 3/24, కార్స్ 2/28)