మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు విజయం సాధించాలన్న ఇంగ్లండ్ 15 ఏండ్ల కల ఎట్టకేలకు నెరవేరింది. 5,468 రోజుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కంగారూల గడ్డపై బెన్ స్టోక్స్ సేన చిరస్మరణీయ విజయాన్ని నమోదుచేసింది. 11 రోజుల్లోనే యాషెస్‌ను కోల్పోయిన (మూడు టెస్టులు జరిగిన రోజులు) ఆ జట్టు.. రెండ్రోజుల్లోనే ముగిసిన మెల్బోర్న్ టెస్టులో ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించి క్లీన్‌స్వీప్ గండాన్ని తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ సేన నిర్దేశించిన 175 పరుగుల ఛేదనను ఇంగ్లండ్.. తమకు అచ్చొచ్చిన బజ్‌బాల్ ఆటతో 32.2 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టపోయి పూర్తిచేసింది. జాకబ్ బెతెల్ (40), జాక్ క్రాలీ (37), బెన్ డకెట్ (34) రాణించారు. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసిన ఇంగ్లండ్ పేసర్ జోష్ టంగ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య ఆఖరి టెస్టు జనవరి 4 నుంచి సిడ్నీలో మొదలవనుంది.
తొలి ఇన్నింగ్స్‌లో 152 రన్స్ (39 ఓవర్లు)కే ఆలౌట్ అయిన ఆసీస్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. 34 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 132 రన్స్‌కు కుప్పకూలింది. బ్రైడన్ కార్స్ (4/34), కెప్టెన్ బెన్ స్టోక్స్ (3/24), తొలి ఇన్నింగ్స్ హీరో జోష్ టంగ్ (2/44) కంగారూలను కుదురుకోనీయలేదు. హెడ్ (46) టాప్ స్కోరర్.
ఆసీస్ నిర్దేశించిన 175 పరుగుల ఛేదనలో ఇంగ్లండ్ తమ మార్కు బజ్‌బాల్ ఆటతో రెచ్చిపోయింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్.. 7 ఓవర్లకే 51 పరుగులు జతచేసి మంచి ఆరంభాన్ని అందించారు. ఈ ఇద్దరూ నిష్క్రమించినా సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆడిన బెతెల్ సంయమనంగా ఆడి ఇంగ్లండ్ విజయాన్ని ఖరారు చేశాడు. రూట్ (15), స్టోక్స్ (2) విఫలమైనా బ్రూక్ (18*) లాంఛనాన్ని పూర్తిచేశాడు.
2011 జనవరి సిడ్నీలో జరిగిన టెస్టులో గెలిచిన తర్వాత ఇంగ్లండ్.. ఆసీస్ గడ్డపై టెస్టు విజయాన్ని మరిచిపోయింది. ఈ 15 ఏండ్ల కాలంలో అక్కడ 18 టెస్టుల మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్.. 16 ఓడి రెండింటిని డ్రా చేసుకుంది. తాజా సిరీస్‌కు వెళ్లడానికి ముందు కూడా స్టోక్స్ సేనపై పెద్దగా అంచనాలు లేకపోయినా తొలి మూడు టెస్టుల్లో ఆ జట్టు ప్రదర్శన చూసి మరో క్లీన్‌స్వీప్ తప్పదనకుంటున్న తరుణంలో మెల్బోర్న్ పిచ్ ఇంగ్లండ్‌కు వరమైంది. బ్యాటర్లకు పీడకలలను మిగిల్చిన ఈ పిచ్‌లో ప్రతి 39 బంతులకు ఒక వికెట్ పడింది. రెండ్రోజుల్లో 36 వికెట్లు నేలకూలిన పిచ్‌పై ఇంగ్లిష్ జట్టు తమ కలను నెరవేర్చుకుంది.
0 ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు ఒక్క బంతిని కూడా వేయలేదు. ఆస్ట్రేలియాలో ఇలా జరుగడం ఇదే తొలిసారి.
1 ఒక సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు రెండ్రుజుల్లోనే ముగియడం 129 ఏండ్లలో ఇదే ప్రథమం. యాషెస్‌లో 1888 తర్వాత ఇదే మొదటిసారి.
3 బాక్సింగ్ డే టెస్టుల్లో ఓడటం ఆసీస్‌కు ఇది మూడోవది.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 152, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ : 132,
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 132 (హెడ్ 46, కార్స్ 4/34)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ : 178/6 (బెతెల్ 40, రిచర్డ్సన్ 2/22)