లండన్: అండర్సన్-టెండూల్కర్ సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడో టెస్టు రసవత్తరంగా సాగుతున్నది. ఆధిక్యం చేతులు మారుతున్న మ్యాచ్‌లో విజయం ఎవరదన్నది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యఛేదనలో నాలుగోరోజు ఆట ముగిసే సరికి టీమ్ఇండియా 4 వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(33 నాటౌట్) దీటుగా రాణిస్తుండగా, సహచర బ్యాటర్లు జైస్వాల్(0), కరణ్నాయర్(14), గిల్(6), ఆకాశ్‌దీప్(1) స్వల్ప స్కోర్లకు వెనుదిరిగి నిరాశపరిచారు. ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జైస్వాల్..కీపర్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్, నాయర్ క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.
అయితే కార్స్ బంతిని సరిగ్గా అంచనా వేయని నాయర్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. నాయర్‌ను అనుసరిస్తూ గిల్ కూడా ఔట్ కావడంతో టీమ్ఇండియా కష్టాలు రెట్టింపయ్యాయి. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్‌దీప్‌ను స్టోక్స్ బౌల్డ్ చేయడంతో ఆదివారం ఆట ముగిసింది. కార్స్(2/11)కు రెండు వికెట్లు దక్కాయి. చేతిలో ఆరు వికెట్లు ఉన్న భారత్ విజయానికి 135 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఇంగ్లండ్.. సుందర్ (4/22) ధాటికి రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌటైంది. రూట్(40) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు.
ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓవర్‌నైట్ స్కోరు 2/0తో ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లకు సిరాజ్ చుక్కలు చూపెట్టాడు. పదునైన స్వింగ్‌కు వేగాన్ని జోడిస్తూ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన ఓపెనర్ డకెట్(12)..మిడాన్‌లో బుమ్రా చేతికి చిక్కాడు. డకెట్ స్థానంలో క్రీజులోకి వచ్చిన ఒలీ పోప్..క్రాలీకి జతకలిశాడు. బుమ్రా, సిరాజ్ బౌలింగ్‌లో షాట్లు ఆడేందుకు క్రాలీ ఘోరంగా తడబడ్డాడు.
ఇదే ఒత్తిడి పెంచుతూ పోయిన భారత బౌలర్లకు ఫలితం లభించింది. సిరాజ్ వేసిన 12వ ఓవర్లో పోప్(4) వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఔట్‌పై డీఆర్ఎస్కు వెళ్లిన టీమ్ఇండియాకు అనుకూల ఫలితం దక్కింది. దీంతో 42 పరుగులకు ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. బౌలింగ్ మార్పుగా వచ్చిన నితీశ్‌కుమార్‌రెడ్డి.. క్రాలీ(22)ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్‌నకు దూరంగా వెళుతున్న బంతిని ఆడబోయిన క్రాలీ..స్లిప్స్‌లో జైస్వాల్ చేతికి చిక్కాడు.
క్రీజులోకి వచ్చిరాగానే బ్రూక్(23) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఆకాశ్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకుంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రూట్‌తో కలిసి ఇన్నింగ్స్ దూకుడు పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో స్వీప్‌షాట్ ఆడబోయిన బ్రూక్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రూట్‌కు జత కలిసిన కెప్టెన్ స్టోక్స్ ఇన్నింగ్స్‌ను గాడిలో పడేసే ప్రయత్నం చేశారు. వీరు క్రీజులో కుదురుకోకుండా కెప్టెన్ గిల్ బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించాడు. లంచ్ విరామ సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్లకు 98 పరుగులు చేసింది.
రూట్‌ను తన లక్ష్యంగా ఎంచుకున్న సిరాజ్ ఔట్ చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించాడు. సిరాజ్ స్వింగ్ డెలీవరీలను ఎదుర్కొనేందుకు తడబడ్డ రూట్ ఎట్టకేలకు సుందర్ చేతికి చిక్కాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన రూట్ క్లీన్‌బౌల్డ్ కావడంతో ఐదో వికెట్‌కు 67 పరుగులు చేసింది. పది పరుగుల తేడాతో స్మిత్(8)ను సుందర్ పెవిలియన్ పంపగా, ఆ తర్వాత స్టోక్స్ వచ్చిరాని స్వీప్ షాట్‌తో ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. టెయిలెండర్లు కార్స్(1), వోక్స్(10)ను బుమ్రా వెంటవెంటనే బౌల్డ్ చేయడంతో టీమ్ఇండియా సంబురాల్లో మునిగిపోయింది. ఆఖర్లో బషీర్(2)ను ఔట్ చేయడం ద్వారా సుందర్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. మొత్తంగా తన స్పిన్ మాయాజాలంతో సుందర్ ఇంగ్లండ్ పతనంలో కీలకమయ్యాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 387 ఆలౌట్, భారత్ తొలి ఇన్నింగ్స్: 387 ఆలౌట్, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 192 ఆలౌట్(రూట్ 40, స్టోక్స్ 33, సుందర్ 4/22, సిరాజ్ 2/31), భారత్ రెండో ఇన్నింగ్స్: 58/4(రాహుల్ 33 నాటౌట్, నాయర్ 14, కార్స్ 2/11, స్టోక్స్ 1/15)