అబుధాబి: ఇంగ్లండ్ బౌలర్లు రెచ్చిపోయారు. ఒకరి తర్వాత ఒకరుగా వరుస పెట్టి వికెట్లు పడగొట్టారు. దీంతో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ విలవిల్లాడారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ మహ్మదుల్లా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. త్రుటిలో ఆలౌట్ ప్రమాదం తప్పించుకున్న ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే ఓపెనర్లిద్దరినీ మొయీన్ అలీ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపు ముష్ఫికర్ రహీమ్ (39), మహ్మదుల్లా (19) కాసేపు నిలబడినా ముష్ఫికర్ అవుట్ అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా దిగజారింది. మహ్మదుల్లాతో సమన్వయలోపంతో ఆతిఫ్ హుస్సేన్ (5) రనౌట్ అయ్యాడు.
ఓపెనర్లు మొహమ్మద్ నయీమ్ (5), లిటాన్ దాస్ (9), షకీబల్ హసన్ (4) పూర్తిగా విఫలమయ్యారు. నురుల్ హసన్ (16), మెహెదీ హసన్ (11) కూడా నిరాశపరిచారు. చివర్లో నాసుమ్ అహ్మద్ (9 బంతుల్లో 19) రెండు సిక్సర్లు కొట్టాడు.
ఇన్నింగ్స్ చివరి ఓవర్ ఆఖరి రెండు బంతులకు బంగ్లా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, మొయీన్ అలీ 2, లియామ్ లివింగ్స్టన్ 2 వికెట్లు కూల్చగా క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.