జోకర్ మళ్లీ నవ్వాడు! నిరుడు తనను ఆడనివ్వని చోటే.. తానేంటో నిరూపిస్తూ అదరగొట్టాడు. అచ్చొచ్చిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో పదో టైటిల్ ఖాతాలో వేసుకోవడంతో పాటు.. అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ (22) నెగ్గిన దిగ్గజ ప్లేయర్ రఫేల్ నాదల్‌ను సమం చేశాడు. ఫైనల్ చేరే క్రమంలో ఒక్క సెట్ మాత్రమే కోల్పోయిన నొవాక్ జొకోవిచ్.. ఫైనల్లో తనలోని పోరాట యోధుడిని తట్టి లేపాడు. హోరాహోరీగా జరిగిన తుదిపోరులో గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ను చిత్తు చేసిన జొకో ఓపెన్ ఎరాలో తనను మించిన వారు లేరని మరోసారి చాటాడు!
మెల్బోర్న్: కీలక సమయాల్లో ఆధిక్యం ఎలా నిలుపుకోవాలో చాటుతూ.. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ పదో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. వరుస విజయాలతో ఫైనల్ చేరిన జొకో ఆదివారం జరిగిన తుదిపోరులో 6-3, 7-6 (7/4), 7-6 (7/5)తో మూడో సీడ్ స్టిఫనోస్ సిట్సిపాస్‌పై విజయం సాధించాడు. 2008లో తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ నెగ్గిన జొకోవిచ్.. పదిహేనేండ్ల కెరీర్లో పదిసార్లు ఇక్కడ విజేతగా నిలువడం విశేషం.
కొవిడ్-19 వ్యాక్సిన్ సమాచారం ఇవ్వనందుకు గానూ నిరుడు ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమైన 35 ఏండ్ల జొకోవిచ్.. తన ఆట పవరేంటో చూపించాడు. తొలి సెట్‌ను సునాయాసంగా ఖాతాలో వేసుకున్న జొకోవిచ్.. ఆ తర్వాత రెండు సెట్లలో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనా.. ట్రైబ్రేకర్స్ కీలక సమయాల్లో పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. ఈ ప్రదర్శనతో తాజా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్ అగ్రస్థానానికి చేరనున్నాడు. ‘అందుకే ఈ టోర్నీ నా కెరీర్లో క్లిష్టమైందనిపించింది. విరామం అనంతరం తిరిగి టైటిల్ నెగ్గడం ఆనందంగా ఉంది’ అని మ్యాచ్ అనంతరం జొకో ఉద్వేగభరితంగా చెప్పాడు. సిట్సిపాస్‌పై గెలిచిన వెంటనే ప్రేక్షకుల్లో కూర్చున్న తన కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్న సెర్బియా వీరుడు.. తల్లిని కౌగిలించుకొని కన్నీటి పర్యంతమయ్యాడు.
22 ఎదురులేని వీరుడు
రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడుతున్న 24 ఏండ్ల సిట్సిపాస్.. జొకోవిచ్‌కు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో జొకో చేతిలో ఓడిన సిట్సిపాస్ ఈ సారి కూడా గెలుపు గీత దాటలేకపోయాడు. 15 ఏస్‌లతో సత్తాచాటిన సిట్సిపాస్.. 40 విన్నర్స్ సంధించగా.. 7 ఏస్లతోనే సరిపెట్టుకున్న జొకోవిచ్ 36 విన్నర్స్ కొట్టాడు. అయితే అనవసర తప్పిదాలతో సిట్సిపాస్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన మారథాన్ మ్యాచ్‌లో టై బ్రేకర్స్‌లో ఆధిక్యం కనబర్చిన జొకో పదోసారి టైటిల్ ముద్దాడాడు. మెల్బోర్న్లో జొకోవిచ్‌కు ఇది వరుసగా 28వ విజేయం కాగా.. కెరీర్లో 93వ ఏటీపీ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. ఓపెన్ ఎరాలో మార్గరేట్ కోర్ట్ (24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్), సెరెనా విలియమ్స్ (23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్) మాత్రమే జొకోకంటే ముందున్నారు.
జొకోవిచ్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
ఆస్ట్రేలియా ఓపెన్: 10 (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023)
ఫ్రెంచ్ ఓపెన్: 2 (2016, 2021)
వింబుల్డన్: 7 (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022)
యూఎస్ ఓపెన్: 3 (2011, 2015, 2018)