మరికల్, సెప్టెంబర్ 24 : అర్ధరాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు ఇంటికి వచ్చి.. ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన బుధవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం మాధవరంలో చోటుచేసుకున్నది. మరికల్ ఎస్సై రాంరాల్ తెలిపిన వివరాల ప్రకారం.. మాధవరం గ్రామానికి చెందిన బాలస్వామి (45) బుధవారం తన ఇంట్లో నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తలుపు తట్టారు.
బాలస్వామి భార్య తలుపు తెరువగా, వారు లోనికి దూసుకొచ్చి బాలస్వామిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయారు. గాయపడిన బాలస్వామిని కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో మహబూబ్నగర్ జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.