అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సైన్స్‌ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రాకా’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పురాణ, వేద, వర్తమాన.. ఇలా భిన్న కాలాల నేపథ్యంలో సాగే కథాంశమిదని, సమాంతర ప్రపంచాలు అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ సినిమా నుంచి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. ఈ విషయంలో అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్పందించారు. ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాలని, అత్యుత్తమ చిత్రాన్ని అందించేందుకు తాము శ్రమిస్తున్నామని చెప్పారు. ‘మీ నిరీక్షణకు తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సినిమా కోసం టీమ్ చేస్తున్న కృషి నాకు గర్వంగా ఉంది’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అట్లీ దర్శకత్వంలో సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.