ఆట అంటే ఆయనకు ఇష్టం. బతుకంతా ఆటే అంటాడు. ఆ బతుకులో సూపర్ కిక్ ఉండాలనే తైక్వాండో క్రీడను ఎంచుకున్నాడు. వరల్డ్ చాంపియన్ లక్ష్యంగా ముందుకుసాగాడు ఎల్లావుల గౌతమ్ యాదవ్. అనుకోని అడ్డంకులు వచ్చిపడ్డాయి. ఊహించని ప్రమాదం ఆ ఆటగాడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. అయినా, పట్టు వీడలేదు. ప్రాణాలకు తెగించి, వైకల్యాన్ని ఎదిరించి వరల్డ్ పారా తైక్వాండో చాంపియన్‌గా ఎదిగాడు. తెలంగాణ నుంచి ఈ ఘనతసాధించిన తొలి వ్యక్తిగా నిలిచిన గౌతమ్ ప్రస్థానం ఇది.
హనుమ కొండ జిల్లా పైడిపెల్లి గ్రామానికి చెందిన ఎల్లావుల లలిత, కుమార్ యాదవ్‌లకు కవల పిల్లలు గౌతమ్, గణేశ్. ఇద్దరికీ చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. 12 ఏండ్ల వయసులో గౌతమ్ తైక్వాండో కెరీర్‌ను ప్రారంభించాడు. 2006 నుంచి 2010 వరకు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) తరపున పాల్గొన్నాడు. వరంగల్‌లో 2007లో జిల్లా స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. 2008 రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం గెలుచుకున్నాడు.
2008లో సౌత్ జోన్ నేషనల్స్‌లో మిడిల్ వెయిట్లో సిల్వర్ మెడల్, హెవీవెయిట్‌లో గోల్డ్ మెడల్, 2009 అక్టోబర్‌లో రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్… ఇలా గౌతమ్ బరిలో ఉంటే పతకం పక్కా అనిపించుకున్నాడు. కోచ్ విఠల్‌రెడ్డి అకాడమీలో శిక్షణ పొంది జాతీయస్థాయిలో ఎన్నోసార్లు సత్తా చాటాడు. రెండు తెలుగు రాష్ట్రాలకు కోచ్‌గానూ ప్రాతినిధ్యం వహించాడు. రాష్ట్ర, జాతీయస్థాయి చాంపియన్‌షిప్‌లు, జేఎన్టీయూ నుంచి ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీకి టోర్నమెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. హైదరాబాద్ నుంచి 2016- 2018 వరకు, 2018 నుంచి 2020 వరకు కాకతీయ యూనివర్సిటీ నుంచి ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
మూడు విజయాలు, ఆరు పతకాలతో సాగిపోతున్న గౌతమ్ జీవితాన్ని ఓ ప్రమాదం ఊహించని మలుపు తిప్పింది. 2020లో పంజాబ్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అతను కారు ప్రమాదానికి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్లో గౌతమ్ వెన్నెముక దెబ్బతిన్నది. 21 రోజులపాటు వెంటిలేటర్‌పై కోమాలో ఉన్నాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచి వైద్యసాయం అందేలా చూశారు.
స్పృహలోకి వచ్చిన మూడు నెలల తర్వాత గౌతమ్ మాట్లాడగలిగాడు. అప్పుడు గానీ, తను ఇక సొంతకాళ్లపై నిలబడలేనని అతనికి తెలియలేదు. అయినా బెంబేలెత్తిపోలేదు. కుంగిపోనూ లేదు. వైకల్యం శరీరానికే కానీ, మనసుకు కాదు అనుకున్నాడు. కోలుకున్న తర్వాత గౌతమ్ తన లక్ష్యాన్ని వదిలిపెట్టలేదు. మరింత కసిగా బరిలో దిగేందుకు ప్రయత్నించాడు. మునుపటి కన్నా రెట్టింపు ఉత్సాహంతో ఆటను మళ్లీ మొదలుపెట్టాడు. పారా క్రీడాకారుడిగా బరిలో దిగాడు. అలా 2024లో పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరిగిన మూడో జాతీయస్థాయి ఓపెన్ పారా తైక్వాండో బంగారు పతకం సాధించాడు.
అదే ఏడాది బహ్రెయిన్‌లో జరిగిన తొలి ప్రపంచ పారా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో అత్యున్నత ప్రతిభ ప్రదర్శించి గోల్డ్ మెడల్ కొల్లగొట్టాడు. 48 దేశాల నుంచి 260 మంది ఈ టోర్నీలో పాల్గొన్నారు. మనదేశం నుంచి 21 మంది క్రీడాకారులు వెళ్లారు. ఈ పోటీలో గౌతమ్ అనితర ప్రతిభను ప్రదర్శించి, స్వర్ణ పతకం సాధించి ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు. భారత కీర్తిపతాకను రెపరెపలాడించాడు. తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసిన గౌతమ్‌కు మనమూ సాహో చెబుదాం!
“శిక్షణ కోసం ప్రతి నెల లక్షల్లో ఖర్చవుతున్నది. పారా స్పోర్ట్స్‌ను చిన్నచూపు చూడొద్దు. రెగ్యులర్ స్పోర్ట్స్‌గా చూడాలి. పేదల కోసం ప్రభుత్వం కేర్ ఫిజియోథెరఫీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. మా అమ్మానాన్నలు, అన్నయ్య గణేశ్ ప్రోత్సాహంతో రికవరీ అయ్యాను. ప్రభుత్వం వెంటనే స్పోర్ట్స్ పాలసీ తీసుకురావాలి. 2028లో జరిగే ‘లాస్ ఏంజిల్స్ పారా ఒలింపిక్స్’లో గోల్డ్ మెడల్ సాధించడమే నా లక్ష్యం. ప్రభుత్వం ఆర్థికంగా ప్రోత్సహిస్తే క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించగలుగుతారు. మనదేశ కీర్తిని ప్రపంచానికి చాటగలుగుతారు.”
– గౌతమ్
– పిన్నింటి గోపాల్
– గొట్టె వెంకన్న