హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టు శుక్రవారం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏలో బహుళ యాజమాన్యంలో ఉన్న 57 క్లబ్‌లపై మూడేండ్ల నిషేధం విధిస్తూ జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలోని ఏకసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్, జాన్‌మనోజ్, చార్మినార్ క్రికెట్ అసోసియేషన్, బడ్డింగ్ స్టార్ క్రికెట్ అసోసియేషన్లు కోర్టును ఆశ్రయించాయి. కేసును విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్, జస్టిస్ సుధాంశు దులియాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌సీఏ వ్యవహారాలపై గతంలో సుప్రీం కోర్టు విధించిన జస్టిస్ నాగేశ్వర్రావు ఏకసభ్య కమిటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
త్వరలోనే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. ఎలక్టోరల్ కాలేజ్ జాబితాలో మార్పులు, చేర్పులపై దిగువ కోర్టులు ఆదేశాలు చెల్లవు. ఏకసభ్య కమిటీ విధులకు విఘాతం కల్గించే ఆదేశాలు అమల్లోకి రాలేవు. హెచ్‌సీఏ ఎన్నికలు, సంస్కరణల అంశంలో ఏకసభ్య కమిటీకి పూర్తి అధికారాలు ఇచ్చింది. సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటీషన్లు కూడా ఎన్నికల నిర్వహణకు ఆటంకం కాబోదు. జస్టిస్ నాగేశ్వర్రావు కమిటీ తమ విధులను యాథావిధిగా నిర్వర్తించాలని జస్టిస్ సంజయ్ కిషన్‌కౌల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెచ్‌సీఏ సహా ఇతర క్రీడా సంఘాల్లో ఇదే తీరు కనిపిస్తున్నదని అంది. కొందరు వ్యక్తులు శాశ్వతంగా పదవుల్లో కొనసాగేందుకు ఎన్నికల ప్రక్రియకు అడ్డుగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించింది.