Dwayne Bravo : పొట్టి ఫార్మాట్లో వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రావో (Dwayne Bravo) శకం ముగిసింది. ఇప్పటికే వన్డేలకు, టెస్టులతో పాటు ఐపీఎల్ నుంచి వైదొలిగిన బ్రావో సొంతగడ్డపై ఫ్రాంచైజీ క్రికెట్లో ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో ట్రిన్బగో నైట్ రైడర్స్(Trinbag0 Night Riders) జట్టు తరఫున అతడు చివరిసారి బరిలోకి దిగాడు. ఈ సందర్భంగా జట్టు సభ్యులు ‘థ్యాంక్యూ డీజే’ అనే పేరు రాసున్న జెర్సీలు ధరించి బ్రావోకు ‘గార్డ్ ఆఫ్ హానర్’ సమర్పించారు. ఆ ఫొటోలను టీకేఆర్ ఫ్రాంచైజీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. సీపీఎల్ సీజన్ ఆరంభానికి ముందే బ్రావో తన వీడ్కోలు నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే.
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్రావో ఐదు సార్లు ట్రోఫీ అందుకున్నాడు. అది కూడా ట్రిన్బగో నైట్ రైడర్స్ తరఫున అతడు మూడు టైటిళ్లు ముద్దాడాడు. అతడి కెప్టెన్సీలో 2017, 2018లో టీకేఆర్ జట్టును చాంపియన్‌గా అవతరించింది. ఆ తర్వాత పేట్రియాట్స్ జట్టును నడిపించిన బ్రావో 2021లో విజేతగా నిలిపాడు.
మళ్లీ 2024లో పాత జట్టు అయిన టీకేఆర్ తరఫున ఆడాడు. ‘కరీబియన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్ నుంచి మా జట్టుతో కొనసాగినందుకు బ్రావోకు కృతజ్ఞతలు. ఈరోజు వరకూ అతడు ఈ లీగ్ ప్రచారం కోసం చేసిన కృషికి వెలకట్టలేం’ అని ఆండ్రూ రస్సెల్ వెల్లడించాడు.
వెస్టిండీస్ తరఫున రెండు టీ20 వరల్డ్ కప్‌లు గెలుపొందిన బ్రావో ఐపీఎల్లో అదరగొట్టాడు. ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఫ్రాంచైజీలకు ఆడిన అతడు అత్యధిక వికెట్ల వీరుడిగా పేరొందాడు. ఐపీఎల్లో ఈ వెటరన్ ఆల్‌రౌండర్ 161 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీశాడు. బ్యాటుతోనూ విధ్వంస సృష్టిస్తూ 1,560 రన్స్ చేశాడు. ఈ లీగ్‌లో అతను 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. తన సుదీర్ఘ ఐపీఎల్ కెరీర్‌కు బ్రావో 2023లో వీడ్కోలు పలికి బౌలింగ్ కోచ్‌గా అవతారమెత్తాడు. ప్రస్తుతం బ్రావో అఫ్గనిస్థాన్ జట్టుకు అమూల్యమైన సేవలు అందిస్తున్నాడు.