Duleep Trophy | బెంగళూరు: దులీప్ ట్రోఫీలో అంతర్జాతీయ స్టార్లు తేలిపోయారు. ముంబై బ్యాటర్, సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడైన ముషీర్ ఖాన్ (105 నాటౌట్) సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని ఇండియా ‘బీ’ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్ (30) ఫర్వాలేదనిపించగా సుమారు రెండేండ్ల విరామం తర్వాత టెస్టులు ఆడిన రిషభ్ పంత్ (9) సైతం విఫలమయ్యాడు. తెలుగు క్రికెటర్ నితీశ్‌రెడ్డి డకౌట్ అయ్యాడు.
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ఆకాశ్ దీప్, అవేశ్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక అనంతపురం వేదికగా ఇండియా ‘సీ’తో తలపడుతున్న ఇండియా ‘డీ’ బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 48.3 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ అయింది.
అక్షర్ పటేల్ (86) ఆదుకోకుంటే ఆ జట్టు వంద పరుగులు కూడా చేయకపోయి ఉండేది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఇండియా సీ కూడా తడబడింది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 33 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 91 రన్స్ చేసింది.