BCCI-Dream11 | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో ఒప్పందాన్ని ఫాంటసీ స్పోర్ట్స్ కంపెనీ డ్రీమ్ 11 (Dream11) రద్దు చేసుకున్నది. మూడేళ్ల కాలానికి రూ.358కోట్ల స్పాన్సర్షిప్ కోసం 2023లో డ్రీమ్ 11 ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా డ్రీమ్ 11 లోగో టీమ్ ఇండియా జెర్సీపై కనిపించింది. అయితే, ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025’ నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలో ఒప్పందం నుంచి తప్పుచుకోవాలని కంపెనీ నిర్ణయించుకుంది. వాస్తవానికి డ్రీమ్ 11పై బీసీసీఐ చర్యలు తీసుకునే అవకాశం లేదని సమాచారం. అర్ధాంతరంగా ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే నిబంధనల ప్రకారం బీసీసీఐ భారీగా జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
డ్రీమ్ 11 విషయంలో జరిమానా విధించే ఛాన్స్ లేదని తెలుస్తున్నది. ఇందుకు ప్రధాన కారణం ఒప్పందంలోని ప్రత్యేక నిబంధన. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వ చట్టం ఏదైనా కంపెనీ ప్రధాన వ్యాపారాన్ని ప్రభావితం చేస్తే.. ఆ కంపెనీ జరిమానా లేకుండానే ఒప్పందం నుంచి తప్పుకునేందుకు వీలుంది. వాస్తవానికి డ్రీమ్ 11 ఆదాయంలో ఎక్కువ భాగంగా ఫాంటసీ స్పోర్ట్స్ నుంచే వస్తుంది. తాజాగా ఇది నిషేధ జాబితాలోకి చేర్చడంతో డ్రీమ్ 11 జరిమానా నుంచి బయటపడే వీలు కలిగింది. డ్రీమ్ 11 తీసుకున్న నిర్ణయంతో బీసీసీఐ సందిగ్ధంలో పడింది. త్వరలోనే ఆసియా కప్ వంటి కీలక టోర్నీలున్నాయి. ప్రస్తుతం టీమ్ ఇండియాకు అధికారిక స్పాన్సర్ లేదు. ఈ క్రమంలో బోర్డు కొత్త స్పాన్సర్‌ను వెతికి పట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. తక్కువ సమయంలో పెద్ద బ్రాండ్‌తో ఒప్పందం సవాల్‌తో కూడకున్నదే. కాబట్టి అంత సులభం కాదని పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఆసియా కప్ టోర్నీకి సమయం దగ్గరపడుతున్నది. క్రికెట్ వాణిజ్య ప్రపంచంలో ఆర్థిక బలం, బ్రాండ్ విలువ రెండింటికీ స్పాన్సర్ ఉనికి కీలకమైంది. 2023లో బైజు స్థానంలో బీసీసీఐకి ప్రధాన స్పాన్సర్ హక్కులను డ్రీమ్ 11 సొంతం చేసుకుంది. ఈ స్పాన్సర్షిప్ ఒప్పందం ధర దాదాపు రూ.358 కోట్లు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీ ఒప్పందం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశంలోని పెద్ద కార్పొరేట్ సంస్థలు, ఫిన్‌టెక్ కంపెనీలు ఉండగా.. స్పాన్సర్‌గా ఎవరు ముందుకు వస్తారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. టాటా, రిలయన్స్, అదానీ వంటి కంపెనీలు, జెరోధా, గ్రో వంటి కొత్త తరం ఫిన్ టెక్ కంపెనీలు పోటీపడే అవకాశాలున్నాయి. అయితే, సమయం లేకపోవడంతో, ఆచరణాత్మక ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని బీసీసీఐ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.