IND vs ENG : మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 358కే ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత బజ్ బాల్ ఆటతో రెచ్చిపోయింది. ఓపెనర్లు బెన్ డకెట్ (94), జాక్ క్రాలే (84)లు ఆకాశమే హద్దుగా చెలరేగగా ఆఖరి సెషన్లో భారీగా రన్స్ వచ్చాయి. ఈ జోడీని జడేజా విడదీసి బ్రేకివ్వగా.. కాసేపటికే డకెట్‌ను ఔట్ చేసిన అన్షుల్ తొలి వికెట్ సాధించాడు. మొత్తంగా రెండోరోజు స్టోక్స్ సేన ఆధిపత్యంతో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది.
ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో భారత బ్యాటర్లు తడబడిన చోట ఇంగ్లండ్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపి.. గిల్ సేను ఒత్తిడిలో పడేశారు. బెన్ డకెట్ (90) , జాక్ క్రాలే(84)లు ధనాధన్ ఆడగా 20 ఓవర్లకే స్కోర్ వంద దాటింది. బజ్ బాల్ ఆటతో విరుచుకుపడిన ఈ జోడీని జడేజా విడదీయగా 166 వద్ద ఆతిథ్య జట్టు తొలి వికెట్ కోల్పోయింది. సెంచరీకి చేరువైన డకెట్‌ను అన్షుల్ ఔట్ చేసి రెండో వికెట్ అందించాడు.
Anshul Kamboj strikes 👍
His maiden wicket in international cricket ✅
England 2 down as Ben Duckett departs.
Updates ▶️ https://t.co/L1EVgGtx3a#TeamIndia | #ENGvIND pic.twitter.com/2VhN6Z5RnG
— BCCI (@BCCI) July 24, 2025
వరుసగా రెండు వికెట్లు పడడంతో స్కోర్ నెమ్మదించింది. ఓలీ పోప్(20 నాటౌట్), జో రూట్(11 నాటౌట్) ఆచితూచి ఆడారు. దాంతో, ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఇంకా 133 కొడితే భారత్ స్కోర్ దాటేస్తుంది స్టోక్స్ సేన. భారత జట్టు మ్యాచ్‌లో నిలవాలంటే మూడో రోజు తొలి సెషన్లో బౌలర్లు నిప్పులు చెరగాలి. లేదంటే ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీలో కీలకమైన మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు మంచి అవకాశాన్ని చేజార్చుకుంది. సాయి సుదర్శన్(61) యశస్వీ జైస్వాల్(58)లు శార్దూల్ ఠాకూర్(41), వాషింగ్టన్ సుందర్(27) రాణించినా.. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయి 358 పరుగులకే కుప్పకూలింది. పాదం నొప్పిని పంటిబిగువన భరిస్తూనే రిషభ్ పంత్(54).. సమయోచిత బ్యాటింగ్‌తో శార్థూల్ ఠాకూర్(41) పోరాడినా బెన్ స్టోక్స్ (5-72) దెబ్బకొట్టాడు. ఐదు వికెట్లుతో చెలరేగిన ఇంగ్లండ్ సారథికి స్పీడ్‌స్టర్ ఆర్చర్ కూడా తోడవ్వడంతో రెండో సెషన్లో కాసేపటికే గిల్ సేన ఇన్నింగ్స్ ముగిసింది.