భారత ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగింపుపై సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. గత కొన్ని రోజులుగా ద్రవిడ్ భవిష్యత్‌పై వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పడింది. మరోమారు అతనికే బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్‌తో పాటు సహాయక సిబ్బంది కాంట్రాక్టు గడువులను పొడిగిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఎంత కాలమన్నది బీసీసీఐ స్పష్టంగా పేర్కొనలేదు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి రాహుల్ మరోమారు జట్టుతో కలిసి పనిచేయనున్నాడు.
న్యూఢిల్లీ: భారత దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ మరికొన్ని రోజుల పాటు చీఫ్ కోచ్‌గా కొనసాగనున్నాడు. స్వదేశం వేదికగా జరిగిన ప్రపంచకప్ టైటిల్ వేటలో విఫలమైన నేపథ్యంలో ద్రవిడ్ కొనసాగింపుపై గత కొన్ని రోజులుగా అస్పష్టత నెలకొన్నది. దీనికి ముగింపు పలుకుతూ బీసీసీఐ ద్రవిడ్‌ను మరికొంత కాలం కొనసాగించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి ఇటీవలి ప్రపంచకప్‌తో ఇది వరకు ఉన్న కాంట్రాక్టు గడువు ముగిసింది. ద్రవిడ్ సమ్మతి మేరకు బోర్డు బుధవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాహుల్‌తో పాటు సహాయక సిబ్బందిగా వ్యవహరిస్తున్న విక్రమ్ రాథోడ్(బ్యాటింగ్ కోచ్), పారస్ మాంబ్రె(బౌలింగ్ కోచ్), దిలీప్(ఫీల్డింగ్ కోచ్) కాంట్రాక్టులను పొడిగిస్తున్నట్లు బోర్డు అధికారికంగా పేర్కొంది. దీంతో రానున్న దక్షిణాఫ్రికా పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది. ద్రవిడ్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని, గత కొన్నేండ్లుగా టీమ్ఇండియా నిలకడగా రాణిస్తున్నదని బోర్డు కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. అయితే ఇదిలా ఉంటే కాంట్రాక్టు గడువు ఎప్పటి వరకు అన్నది బోర్డు స్పష్టం చేయలేదు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ లేదా పాకిస్థాన్‌లో 2025లో జరిగే చాంపియన్స్ ట్రోఫీ దాకా అన్నది ఇంకా తేలాల్సిఉంది. ప్రస్తుతం ద్రవిడ్ గైర్హాజరీలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్..ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
భారత చీఫ్ కోచ్ పదవి కొనసాగింపుపై రాహుల్ ద్రవిడ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘టీమ్ఇండియాతో గత రెండేండ్లుగా నా ప్రయాణం చిరస్మరణీయమైనది. ఈ సమయంలో మేము ఎన్నో ఎత్తుపల్లాలను చూశాం. జట్టు సభ్యులతో ప్రయాణం అద్భుతంగా కొనసాగుతున్నది. ప్రపంచకప్ ఓటమి ఒకింత నిరుత్సాహానికి గురిచేసినా..ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుకు సాగుతాం. భవిష్యత్‌లో ఎదురయ్యే కఠిన సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని అన్నాడు.
రాహుల్ ద్రవిడ్ తిరిగి కొనసాగేందుకు సమ్మతించని నేపథ్యంలో ప్రధాన కోచ్‌గా పనిచేసేందుకు మాజీ క్రికెటర్ ఆశీష్ నెహ్రాను బీసీసీఐ పెద్దలు సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌తో చీఫ్ కోచ్‌గా 2025 వరకు ఒప్పందం ఉన్న నేపథ్యంలో నెహ్రా అందుకు నో చెప్పినట్లు తెలిసింది. గుజరాత్‌తో ఒప్పందాన్ని గౌరవించేందుకు నెహ్రా మొగ్గుచూపినట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. దీనికి తోడు భారత చీఫ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకుంటే చిన్నపిల్లలైన తన కూతురు, కొడుకును విడిచిపెట్టి ప్రయాణాలు చేయాల్సి వస్తుందన్న కారణంతో బోర్డు ప్రతిపాదనకు నెహ్రా ఓకే చెప్పలేదని సమాచారం. భవిష్యత్‌లో సరైన సమయం వచ్చినప్పుడు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు నెహ్రాను కోచ్‌గా పరిగణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.