దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరు దేశాల ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ప్లేయర్ల కరచాలనంతో రచ్చ చెలరేగగా, తాజాగా ట్రోఫీ ప్రదాన కార్యక్రమం మరింత నిప్పు రాజేసింది. తుది పోరు దాదాపు 12 గంటలకు(భారత కాలమానం ప్రకారం) పూర్తి కాగా, గంటకు పైగా వేచిచూడాల్సి వచ్చింది. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అభిమానులు ట్రోఫీ ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూశారు. మరోవైపు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు తమ అభిమాన జట్టు ట్రోఫీ అందుకునే సందర్భంగా అలాగే ఉండిపోయారు. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడుగా ఉన్న మోహసిన్ నక్వి చేతుల మీదుగా ట్రోఫీ తీసుకునేందుకు టీమ్ఇండియా ససేమిరా అన్నట్లు తెలిసింది.
దీనికి తోడు ఓడిన నైరాశ్యంలో ఉన్న పాక్ టీమ్..డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చేందుకు నాటకాలు ఆడింది. దీంతో కామెంటరీ ప్యానెల్లో ఉన్న రవిశాస్త్రి, వసీం అక్రమ్, మంజ్రేకర్ ముగింపు కార్యక్రమ నిర్వహణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మొదలైన కార్యక్రమం అసలు ట్రోఫీ ఇవ్వకుండానే ముగియడం కొత్త వివాదానికి దారి తీసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా తిలక్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా అభిషేక్‌శర్మ నిలువగా, పాక్ ప్లేయర్లు రన్నరప్ చెక్ అందుకున్నారు. అయితే చెక్‌ను పాక్ కెప్టెన్ సల్మాన్ ఆగా స్టేజ్‌పై విసిరివేయడం లైవ్‌లో కనిపించింది. మొత్తంగా నక్వీ చేతుల మీదుగా భారత్ ట్రోఫీ తీసుకోకుండానే కార్యక్రమం ముగిసింది.