ముంబై, జనవరి 13 : దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి నష్టాలోకి జారుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రతీకార సుంకాలు విధించనుండటంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ఫలితంగా ఒక్కరోజు భారీగా లాభపడిన సూచీలకు బ్లూచిప్ సంస్థల షేర్లలో భారీగా క్రయవిక్రయాలు జరగడంతో తిరిగి నష్టాల్లోకి పడిపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్అండ్టీ, భారతీ ఎయిర్టెల్ షేర్లు పతనం చెందడంతో మార్కెట్లో సెంటిమెంట్ నీరుగారింది. మరోవైపు కార్పొరేట్ల నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు కూడా పతనానికి ఆజ్యంపోసింది. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు నిధులను తరలించుకుపోవడం కూడా సూచీల పతనాన్ని ప్రేరేపించింది.
దీంతో ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 250.48 పాయింట్లు కోల్పోయి 83,627.69 వద్ద స్థిరపడింది. మరోసూచీ నిఫ్టీ 57.95 పాయింట్లు పతనం చెంది 25,732.30 వద్దకు జారుకున్నది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరివరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. చివర్లో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో భారీ నష్టాలను తగ్గించుకోగలిగాయి. మరోసారి అమెరికా ప్రతీకార సుంకాల బాంబు పేల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారి అలజడికి గురయ్యాయి.
దీనికి తోడు రూపాయి బలహీనపడటం, క్రూడాయిల్ ధరలు భగ్గుమనడం, యూఎస్ బాండ్ ఈల్డ్ పెరగడం, ఎఫ్ఐఐలు తరలిపోతుండటం దలాల్‌స్ట్రీట్ పతనానికి కారణాలని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ట్రెంట్, లార్సెన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, మారుతి, ఐటీసీ, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. రంగాలవారీగా టెలికాం సూచీ 1.18 శాతం పతనం చెందగా, దీంతోపాటు ఇండస్ట్రీయల్స్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్, రియల్టీ, ఎనర్జీ రంగ సూచీలు నష్టపోగా..ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, మెటల్, ఆర్థిక సేవలు, కమోడిటీస్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి.