కరీంనగర్, జనవరి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాడి రంగంలో విశేష సేవలందిస్తున్న కరీంనగర్ డెయిరీకి ‘అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డ్-2025 తెలంగాణ’ లభించింది. ఈ సందర్భంగా డెయిరీ చైర్మన్ చలిమెడ రాజేశ్వర్రావు మాట్లాడుతూ.. పాడి రైతులకు మేలు చేకూర్చాలన్న ఉద్దేశంతో కరీంనగర్ డెయిరీ నుంచి అనేక రకాల చర్యలు తీసుకుంటున్నట్లు, ఫలితంగా డెయిరీ గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు.
ఒకప్పుడు కేవలం 12 వేల పాల లీటర్ల సేకరణకు మాత్రమే పరిమితమైన సంస్థ, ఇప్పుడు రోజుకు 2 లక్షల లీటర్లు సేకరిస్తున్నదని, అలాగే 4 వేల లీటర్ల విక్రయాల నుంచి 1.80 లక్షల లీటర్లకు పెంచామన్నారు. డెయిరీ టర్నోవర్ రూ.450 కోట్లకు పెంచినట్లు తెలిపారు. రైతుకు ప్రత్యామ్నాయ ఉపాధిగా ఉపయోగపడే పాడి పరిశ్రమకు పెద్దపీట వేయాలన్న సంకల్పంతో చేపడుతున్న చర్యలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వినియోగదారుల ఆదరణ రోజురోజుకూ పెరుగుతుందన్నారు.
న్యూఢిల్లీ, జనవరి 13: దిగుమతి సుంకం నిర్మాణాన్ని హేతుబద్ధం చేయడం, రాబోయే బడ్జెట్లో కేటాయింపులు పెంచడం వంటివి దేశీయ తయారీ, ఎగుమతులకు ఊతమివ్వగలవని డెలాయిట్ ఇండియా అభిప్రాయపడింది. ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్ఈజెడ్)కి సంస్కరణలు కూడా అవసరమన్న డెలాయిట్.. కస్టమ్స్ సుంకాల సడలింపు, ఇతరత్రా నిర్ణయాలూ కీలకమేనని పేర్కొన్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ను ప్రకటించనున్న విషయం తెలిసిందే.