Team India Captains : ముందుండి నడిపించేవాడే నాయకుడు. ఏ రంగానికైనా ఇది వర్తిస్తుంది. క్రికెట్(Cricket) కూడా ఇందుకు తీసిపోదు. ఇంకా చెప్పాలంటే.. దేశానికి ప్రాతినిధ్యం వహించే జట్టుకు సారథ్య బాధ్యతలంటే కత్తి మీద సాములాంటిదే. కెప్టెన్‌గా కొన్నిసార్లు త్యాగాలకు కూడా వెనుకాడకూడదు. జట్టు అవసరాల కోసం తన స్థానాన్ని కూడా కొన్నిసార్లు మార్చుకోవాల్సి ఉంటుంది. భారత జట్టు(Team India)లో ఈ కొత్త సంప్రదాయానికి నాంది పలికింది ఎవరో తెలుసా..? రాహుల్ ద్రవిడ్(Rahul Dravid). ఆ తర్వాత కూడా కొందరు ఇండియన్ కెప్టెన్లు ఇలా తమ బ్యాటింగ్ పొజిషన్ మార్చుకున్నారు. వాళ్లు ఎవరంటే..?
వెస్టిండీస్ వేదికగా జరిగిన 2007 ప్రపంచ కప్(2007 World Cup)లో భారత జట్టు తొలి గేమ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలై విమర్శలు మూటగట్టుకుంది. దీంతో కెప్టెన్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid).. బెర్ముడా(Bermuda)తో జరిగిన మ్యాచ్‌లో ఏడో స్థానంలో దిగాడు. అప్పట్లో అప్పర్ మిడిలార్డర్లో బ్యాటింగ్ చేసే ద్రవిడ్ ఆ మ్యాచ్‌లో లోయర్ మిడిలార్డర్లో దిగి జట్టు జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.
టెస్టు క్రికెట్(Test Cricket)లో రాహుల్ ద్రవిడ్‌ను ఎదుర్కోవడాన్ని బౌలర్లు కష్టసాధ్యమైన పనిగా భావించేవారు. మూడో నంబరులో బ్యాటింగ్ చేసే ద్రవిడ్ జట్టు స్కోరు మెజారిటీ రన్స్ సాధించేవాడు. ద్రవిడ్ కెప్టెన్సీలో భారత జట్టు 2006లో పాకిస్థాన్‌లో పర్యటించింది. లాహోర్(Lahore Test) జరిగిన తొలి టెస్టులో ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag)తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 679 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. పాక్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు సెహ్వాగ్‌తో కలిసి ద్రవిడ్ క్రీజులోకి వచ్చాడు.
రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్
సెహ్వాగ్ 247 బంతుల్లో 254 పరుగులు చేయగా, ద్రవిడ్ 233 బంతుల్లో అజేయంగా 128 పరుగులు చేశాడు. వీరిద్దరూ బ్యాట్లతో చెలరేగిపోవడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. అయితే, 410 పరుగుల వద్ద వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఆ మ్యాచ్ డ్రా ముగిసింది. ఓపెనర్‌గా దిగి సత్తా చాటిన ద్రవిడ్ అప్పటి నుంచి ఓపెనర్‌గానే కొత్త అవతారం ఎత్తాడు.
భారత జట్టు ప్రస్తుతం వెస్టిండీస్‌లో పర్యటిస్తోంది. టెస్టు సిరీస్‌ను 1-0తో గెలుచుకున్న ఇండియా ఆ తర్వాత వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే.. తొలి వన్డేలో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్.. ఇండియా బౌలర్ల దెబ్బకు విలవిల్లాడింది. జడేజా 3, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీయడంతో కరీబియన్ జట్టు 114 పరుగులకే కుప్పకూలింది.
రోహిత్ శర్మ
యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్లో ఇషాన్ కిషన్(Ishan Kishan)ను తన స్థానంలో పంపాడు. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్న ఇసాన్ అర్ధ సెంచరీ చేయగా, గిల్ మాత్రం ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. గిల్ అవుటైన తర్వాత రోహిత్ వస్తాడని భావించినా సూర్యకుమార్ యాదవ్‌ను పంపాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఏడో నంబరులో క్రీజులోకి వచ్చాడు. 19 బంతుల్లో 12 పరుగులు చేశాడు.
భారత జట్టు 2011లో మహేంద్రసింగ్ ధోనీ(MS Dhoni) సారథ్యంలో ప్రపంచకప్ సాధించింది. అద్భుతమైన నాయకత్వంతో జట్టును ముందుండి నడిపించిన ధోనీ బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర పోషించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంక(Srilanka)తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. శ్రీలంక కప్టెన్ సంగక్కర టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లంక నిర్ణీత 50 ఓర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెటరన్ ఆటగాడు మహేల జయవర్దనే అజేయ సెంచరీ సాధించాడు.
మహేంద్రసింగ్ ధోనీ
భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా రెండో బంతికే వీరేంద్ర సెహ్వాగ్(virender sehwag) వికెట్‌ను కోల్పోయింది. ఆ వెంటనే సచిన్ కూడా 18 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. క్లిష్ట సమయంలో క్రీజులో పాతుకుపోయిన గౌతం గంభీర్ – విరాట్ కోహ్లీ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 114 పరుగుల వద్ద కోహ్లీ కూడా వెనుదిరిగడంతో జట్టు పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది.
ధోనీ, యువరాజ్ సింగ్
కోహ్లీ అవుట్ తర్వాత యువరాజ్ సింగ్(Yuvraj Singh) బ్యాటింగ్‌కు రావాల్సి ఉండగా, అతడిని ఆపి ధోనీ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ కలిసి 109 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. గంభీర్ మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ధోనీ 79 బంతుల్లోనే 91 పరుగులు చేసి జట్టుకు ప్రపంచ కప్ అందించాడు.