మంగళవారం 31 మార్చి 2020
Sports - Feb 03, 2020 , 03:12:21

ఎనిమిదోసారీ జొకోవిచ్‌దే

ఎనిమిదోసారీ జొకోవిచ్‌దే

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తనకు తిరుగులేదని నిరూపిస్తూ.. సెర్బియా వీరుడు నొవాక్‌ జొకోవిచ్‌ ఎనిమిదోసారి ట్రోఫీ చేజిక్కించుకున్నాడు. ఇప్పటివరకు మెల్‌బోర్న్‌లో ఆడిన ఏడు ఫైనల్స్‌లోనూ గెలుపొందిన జొకో.. ఆదివారం జరిగిన తుది పోరులో 6-4, 4-6, 2-6, 6-3, 6-4తో డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)పై విజయం సాధించాడు. నాలుగు గంటలపాటు సాగిన హోరాహోరీ పోరులో ఒక దశలో వరుసగా రెండు సెట్లు ఓడి వెనుకంజ వేసినా.. తన అనుభవాన్ని రంగరిస్తూ కీలక సమయాల్లో పైచేయి సాధించి టైటిల్‌ ఒడిసి పట్టాడు. ఫలితంగా ఒకే గ్రాండ్‌స్లామ్‌లో అత్యధిక టైటిల్స్‌ సాధించిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. నాదల్‌ (12, ఫ్రెంచ్‌ ఓపెన్‌), ఫెదరర్‌ (8, వింబుల్డన్‌) ముందున్నారు.

  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన దిగ్గజం

‘హార్డ్‌కోర్ట్‌ రారాజు నేనే’అంటూ సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి గర్జించాడు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తుదిపోరులో అజేయ రికార్డును కొనసాగిస్తూ రెచ్చిపోయాడు. ఫైనల్లో ఆస్ట్రియా సంచలనం థీమ్‌ను ఓడించి ఎనిమిదోసారి టైటిల్‌ ముద్దాడాడు. నాలుగు గంటల పాటు సాగిన ఐదు సెట్ల పోరులో.. ఓ దశలో కఠిన పరిస్థితులు ఎదురైనా తనదైన దూకుడుతో పుంజుకొని సత్తాచాటాడు. 


థీమ్‌ సైతం అద్భుత ప్రదర్శన కనబరిచినా.. తన అనుభవాన్నంతా రంగరించిన నొవాక్‌ చివరికి విజయ దరహాసం చేశాడు.చాలా షాట్లు గతి తప్పాయి. తప్పిదాలు పెరిగిపోయాయి. ఫలితంగా వరుసగా రెండు సెట్లు పోయాయి. తర్వాతది చేజారితే పరాభవం తప్పదు. అయినా జొకోవిచ్‌ ఏ మాత్రం టెన్షన్‌ పడలేదు. తన అవకాశం కోసం ఎదురుచూశాడు. కఠిన పరిస్థితుల్లో ఏం చేయాలో ఇప్పటికే ఎన్నోసార్లు అవగతమైన పాఠాలను జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. ఆసాంతం ప్రశాంతతతో తనలోని అసలు సిసలు పోరాట యోధుడిని బయటకు తీశాడు. పూర్తి సామర్థ్యాన్ని వాడి విజయ ఢంకా మోగించాడు. 


మెల్‌బోర్న్‌: తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సెర్బియా దిగ్గజ ఆటగాడు నొవాక్‌ జొకోవిచ్‌ మరోసారి సత్తాచాటాడు. ఈ టోర్నీ తుదిపోరులో ఇప్పటి వరకు ఓటమెరుగని రికార్డును కొనసాగించాడు. ఎనిమిదో సారి ఆస్ట్రేలియా గడ్డపై టైటిల్‌ను కైవసం చేసుకొని.. గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల సంఖ్యలో తన (17) కంటే ముందున్న ఫెదరర్‌ (20), నాదల్‌ (19)ను మరింత సమీపించాడు. ప్రేక్షకులతో కిక్కిరిసిపోయిన ఇక్కడి రోడ్‌ లావెర్‌ ఎరీనాలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌, రెండో సీడ్‌ జొకోవిచ్‌ 6-4, 4-6, 2-6, 6-3, 6-4తేడాతో ఐడో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)పై గెలిచాడు. నాలుగు గంటల పాటు ఐదుసెట్లుగా జరిగిన మ్యాచ్‌ ఎన్నో మలుపులు తిరిగినా జొకోదే పైచేయి అయింది.

థీమ్‌.. అదుర్స్‌ 

తొలి సెట్‌ను జొకో సులువుగానే దక్కించుకుంటే.. రెండో సెట్‌ నుంచి థీమ్‌ షో మొదలైంది. ఎదురుగా ఉన్నది 17 గ్రాండ్‌స్లామ్‌ల విజేత అయినా థీమ్‌ ఏ మాత్రం బెదరకుండా ముందుకుసాగాడు. సెమీస్‌లో టాప్‌ సీడ్‌ నాదల్‌ను చిత్తుచేసిన సందర్భాన్ని గుర్తు తెచ్చేలా దూకుడు పెంచాడు. బలమైన ఫోర్‌హ్యాండ్‌ షాట్లతో విరుచుపడుతూ జొకోవిచ్‌ను కట్టడి చేసి రెండు సెట్లు గెలిచాడు

జొకో పంజా

కష్టాల్లో ఉన్నప్పుడు అత్యుత్తమ ఆటగాళ్ల అద్భుత ఆట బయటకు వస్తుందని జొకోవిచ్‌ మరోమారు నిరూపించాడు. రెండు సెట్లు కోల్పోయినా ఎలాంటి టెన్షన్‌ లేకుండా తన మార్క్‌ ఆటతో ముందుకుసాగాడు. మూడో సెట్‌లో 4-3తో ముందంజలో ఉన్న సమయంలో థీమ్‌ సర్వీస్‌ను కొల్లగొట్టి చివరికి సెట్‌ గెలిచాడు. నిర్ణయాత్మక సెట్‌లో జోకోవిచ్‌ మరింత జాగ్రత్తగా ఆడి విభిన్న షాట్లతో ప్రత్యర్థిని తికమక పెట్టాడు. దీంతో ఒత్తిడి భరించలేకపోయిన థీమ్‌ కీలక సమయాల్లో ఎక్కువగా ఔట్‌లు కొట్టి మూల్యం చెల్లించుకున్నాడు.  టైటిల్‌ అందుకున్నాక తన ప్రసంగంలో.. అమెరికా బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్‌ బ్రయంట్‌ను గుర్తుచేసుకొని జొకో భావోద్వేగానికి లోనయ్యాడు. ఆస్ట్రేలియా కార్చిచ్చు పట్ల విచారం వ్యక్తం చేశాడు. కాగా, సోమవారం విడుదల చేసే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ మరోసారి అగ్రస్థానాన్ని అధిష్టించనున్నాడు.  

గ్రాండ్‌స్లామ్‌ సాధించాలన్న కల తుదిపోరులో చెదరడం డొమినిక్‌ థీమ్‌కు ఇది మూడోసారి. గత రెండుసార్లు ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన అతడు.. మట్టికోర్టు కింగ్‌ నాదల్‌ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే.  

ప్రపంచంలోనే నా ఫేవరెట్‌ కోర్ట్‌, స్టేడియం (మెల్‌బోర్న్‌) కచ్చితంగా ఇదే. నువ్వు (థీమ్‌) విజయానికి చేరువగా వచ్చావు. త్వరలోనే గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుస్తావని కచ్చితంగా చెబుతున్నా’
- జొకోవిచ్‌ 

నువ్వు (జొకోవిచ్‌), ఫెదరర్‌, నాదల్‌ టెన్నిస్‌ను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఈ కాలంలో నేను ఆడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నా. ఈ రోజు వెనుకబడ్డా. త్వరలోనే నీతో (జొకో) మళ్లీ పోటీ పడుతానని ఆశిస్తునా.
- థీమ్‌ logo
>>>>>>