Dhruv Jurel : ఐపీఎల్ 16వ సీజన్లో ధ్రువ్ జురెల్ ఇంపాక్ట్ ప్లేయర్(Impact Player)గా సత్తా చాటుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఆడుతున్న ఈ యంగ్‌స్టర్ ఆఖరి ఓవర్లలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు. అయితే.. పేదింట్లో పుట్టిన అతను క్రికెటర్ అవ్వాలనే తన కలను నిజం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డాడు. ‘హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. తనకు క్రికెట్ కిట్ కొనిచ్చేందుకు అమ్మ బంగారు గొలుసు అమ్మిందని తెలిపాడు.
‘నాకు క్రికెట్ కిట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో అమ్మ ఎంతో బాధపడింది. వెంటనే తన మెడలోని బంగారు గొలుసు అమ్మేసి, నాకు కిట్ కొనిచ్చింది. అంతేకాదు నా గ్లోవ్స్ చిరిగిపోతే నాన్న వాటిని కుట్టేవాడు. రోజూ నన్ను స్టేడియం దగ్గర దిగబెట్టేవాడు. ప్రాక్టీస్ పూర్తయ్యాక ఇంటికి తీసుకెళ్లేవాడు’ అని జురెల్ తన ప్రయాణం గురించి వివరించాడు.
Dhruv F
‘చిన్నప్పుడు స్నేహితులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడేవాడిని. కానీ, ఏదో ఒక రోజు క్రికెటర్‌గా రాణిస్తానని కలలో కూడా అనుకోలేదు. మా నాన్న విశ్రాంత సైనికుడు. అందుకని ఆయన అడుగుజాడల్లో నడవాలని అనుకునేవాడిని. నాన్న కూడా నన్ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని ఆశ పడ్డారు. అయితే.. 12 ఏళ్లు ఉన్నప్పుడు సమ్మర్ క్యాంప్ వెళ్లడం నా జీవితంలో టర్నింగ్ పాయింట్. అప్పటి నుంచి క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకున్నా. నా ఆరాధ్య క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni). అతడిని మొదటి సారి చూసిన రోజు మర్చిపోలేను’ అని జురెల్ తెలిపాడు.
ఈ సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ధ్రువ్ జురెల్ ఆఖరి ఓవర్లలో ధాటిగా ఆడుతూ రాజస్థాన్‌కు అండగా నిలుస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌పై ధనాధన్ ఆడిన అతను 15 బంతుల్లో 32 రన్స్ చేశాడు. కానీ, జట్టును గెలిపించలేకపోయాడు. గుజరాత్ టైటన్స్‌పై జురెల్ 10 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 18 రన్స్ కొట్టాడు. షిమ్రన్ హిట్మెయిర్(56) ఆఖరి దాకా నిలిచి రాజస్థాన్‌ను గెలిపించాడు. 4 పరుగులకే రెండు వికెట్లు పడిన దశలో కెప్టెన్ సంజూ శాంసన్ 60 పరుగులు చేసి జట్టు విజయానికి పునాది వేశాడు.