గురువారం 22 అక్టోబర్ 2020
Sports - Oct 17, 2020 , 23:24:05

శిఖర్‌ ధావన్‌ సెంచరీ.. అక్షర్‌ పటేల్‌ మెరుపులు

శిఖర్‌ ధావన్‌   సెంచరీ.. అక్షర్‌ పటేల్‌ మెరుపులు

షార్జా: ఐపీఎల్‌-13లో మరో అద్భుత శతకం నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(101 నాటౌట్‌: 58 బంతుల్లో 14ఫోర్లు, సిక్స్‌) తన  ఐపీఎల్‌ కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు.  ఇన్నింగ్స్‌ ఆద్యంతం క్రీజులో నిలిచిన ధావన్‌..చెన్నై సూపర్‌ కింగ్స్‌పై    యధేచ్ఛగా విరుచుకుపడి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. శనివారం జరిగిన   మ్యాచ్‌లో చెన్నైపై  5 వికెట్లతో  ఢిల్లీ  ఉత్కంఠ విజయం సాధించింది. 

ఓవైపు బ్యాట్స్‌మెన్‌ ఔటవుతున్నా ప్రత్యర్థి బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ధావన్‌ ఒంటరిగా పోరాటం చేశాడు. ఏ దశలోనూ ఇబ్బంది పడని  గబ్బర్‌ చక్కటి భాగస్వామ్యాలను ఏర్పరుస్తూ బౌలర్లకు చుక్కలు చూపించాడు.   ఆఖర్లో అక్షర్‌ పటేల్‌(21నాటౌట్:‌ 5 బంతుల్లో 3సిక్సర్లు) మెరుపులతో ఢిల్లీ   విజయం సాధించింది. 

ఆఖరి  6 బంతుల్లో  ఢిల్లీ విజయానికి 17 పరుగులు అవసరం కాగా క్రీజులో ధావన్‌, అక్షర్‌ ఉన్నారు.   జడేజా వేసిన ఓవర్‌లో అక్షర్‌ మూడు సిక్సర్లు  ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగించాడు.  180 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఒక బంతి మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్లలో శ్రేయస్‌ అయ్యర్‌(23), మార్కస్‌ స్టాయినీస్‌(24) ఫర్వాలేదనిపించారు. 

అంతకుముందు  మొదట బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో  4 వికెట్లకు 179  పరుగులు సాధించింది.  డుప్లెసిస్‌(58: 47 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకానికి తోడు షేన్‌ వాట్సన్‌(36: 28 బంతుల్లో 6ఫోర్లు) రాణించారు.  ఆఖర్లో అంబటి  రాయుడు(45 నాటౌట్‌: 25 బంతుల్లో 1ఫోర్‌, 4సిక్సర్లు ),  రవీంద్ర జడేజా(33 నాటౌట్‌: 13 బంతుల్లో 4సిక్సర్లు ) దుమ్ము రేపారు.  ఢిల్లీ బౌలర్లలో నోర్ట్జే రెండు వికెట్లు తీయగా రబాడ, తుషార్‌ దేశ్‌పాండే చెరో వికెట్‌ పడగొట్టారు. logo