ఢిల్లీ: టోక్యో వేదికగా జరుగుతున్న 25వ డెఫ్లింపిక్స్లో భారత షూటర్లు పతకాల మోత మోగిస్తున్నారు. ఈ పోటీల తొలి రోజే బంగారు పతకంతో మెరిసిన తెలంగాణ కుర్రాడు ధనుశ్ శ్రీకాంత్.. మూడో రోజు జరిగిన పది మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మహిత్ సంధుతో కలిసి స్వర్ణం పతకం కైవసం చేసుకున్నాడు. అతడు ఇప్పటికే పది మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన విషయం విదితమే.
ఇక మిక్స్డ్ టీమ్ ఫైనల్లో ధనుశ్, మహిత్తో పాటు మరో భారత ద్వయం మహ్మద్ ముర్తజా వానియా, కోమల్ మిలిద్ కాంస్యం గెలవడంతో దేశానికి డబుల్ పోడియం ఫినిష్ దక్కినైట్టెంది. కొరియాకు చెందిన జియోన్ డైన్-కిమ్ ఊరిమ్ రజతం సాధించారు. ఫైనల్లో ధనుశ్, మహిత్ 17-7తో కొరియాను ఓడించగా కాంస్య పోరులో ముర్తజా-కోమల్.. 16-12తో ఉక్రెయిన్‌పై గెలిచారు. ఈ టోర్నీలో భారత్ ఇప్పటికే 9 పతకాలు (3 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) సాధించడం విశేషం.