Devdutt Padikkal : కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. తొలి రోజు ఆట పూర్తయ్యే సమాయానికి ఇండియా 300 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. భారత యువ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ తొలి రోజు ఆటలో సెంచరీ సాధించాడు. పడిక్కల్‌కు వరుసగా ఇది రెండో సెంచరీ. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో కూడా అతడు సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
193 బంతుల్లో అతడు 117 పరుగులు చేశాడు. కేశర నువాంత బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆట ముగిసే సమయానికి ధ్రువ్ జరెల్ 7 పరుగులతో, సారాంశ్ జైన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. మ్యాచుకు ముందు టాస్ గెలిచిన ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. 11 ఓవర్లకు 37 పరుగుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన రాహుల్.. లాహిరు కుమార బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం దేవ్‌దత్ పడిక్కల్ బ్యాటింగ్‌కు దిగాడు. తర్వాత యశస్వి జైశ్వాల్ 45 పరుగులకు ఔటయ్యాడు.
17వ ఓవర్లో ఇండియా 66 పరుగుల వద్ద అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో జైశ్వాల్ బౌల్డయ్యాడు. తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌కు దిగాడు. తర్వాత గిల్, పడిక్కల్ నెమ్మదిగా ఆడారు. గిల్ 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత 108 బంతులకు అదే 50 పరుగులకు ఔటయ్యాడు. అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో నిరోషన్ డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి, వెనుదిరిగాడు. తర్వాత రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. అయితే, 3 పరుగుల వద్ద రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ సమయంలో 58 ఓవర్లు పూర్తికాగా, ఇండియా స్కోరు 208/3గా ఉంది.
క్రీజులో ఉన్న పడిక్కల్, జడేజా బాధ్యతాయుతంగా ఆడారు. పడిక్కల్ 168 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఇండియా స్కోర్ 281 పరుగుల వద్ద ఉండగా నాలుగో వికెట్ కోల్పోయింది. పడిక్కల్ 117 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అనంతరం రవీంద్ర జడేజా 43 పరుగులు చేసి, అసిత ఫెర్నాండో బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత సారాంశ్ జైన్ బ్యాటింగ్‌కు దిగాడు. ఆట ముగిసే సమయానికి భారత్ 85 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి, 300 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో మూడు వికెట్లు తీయగా, లాహిరు కుమార, కేశర నువాంత్ ఒక్కో వికెట్ తీశారు.