BGT 2024-25 : ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ ఆరంభానికి మరికొన్ని గంటలే ఉంది. పెర్త్ మైదానం వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య బిగ్ ఫైట్ రేపటితో మొదలుకానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. గాయపడిన శుభ్‌మన్ గిల్(Shubman Gill) స్థానంలో యువకెరటం దేవ్‌దత్ పడిక్కల్ (Devdutt Padikkal)ను స్క్వాడ్‌లో భాగం చేసింది.
రెండు రోజుల ముందే పడిక్కల్‌కు ఆస్ట్రేలియాలోనే ఉండపోవాలని చెప్పిన బీసీసీఐ అతడిని బుధవారం సీనియర్ల బృందంలో చేర్చింది. దాంతో, అతడు గురువారం విరాట్ కోహ్లీ, కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాలతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొననున్నాడు. గిల్ బదులు మూడోస్థానంలో పడిక్కల్‌ను పంపే విషయమై కోచ్ గౌతం గంభీర్, సారథి బుమ్రాల మధ్య చర్చ నడుస్తోందనే సమాచారం ఉంది.
Devdutt Padikkal has joined the #TeamIndia squad.🙌
The left-handed batter shares his experience and excitement of training with the group ahead of the first Test of the Border-Gavaskar Trophy👌👌#AUSvIND | @devdpd07 pic.twitter.com/KxFrbIPMwS
— BCCI (@BCCI) November 21, 2024
భారత బృందంతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడంపై పడిక్కల్ సంతోషం వ్యక్తం చేశాడు. నిజాయతీగా చెబుతున్నా నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాక్టీస్ సెషన్లో ప్రతి ఒక్కరు చాలా సీరియస్‌గా ఉన్నారు. నేను కూడా చాలెంజ్‌గా ఫీలవుతున్నా. సిరీస్ ఆరంభ పోరును అందరూ సవాల్‌గా తీసుకుంటున్నారు. భారత జట్టుతో కలిసి శిక్షణ శిబిరంలో పాల్గొనడం ఎల్లప్పుడూ ఉత్సాహాన్ని ఇచ్చేదే. ఎందుకంటే.. నిజంగా మ్యాచ్ ఆడిన భావన కలుగుతుంది. ఇదే ఊపు, ఉత్సాహాన్ని రేపు మ్యాచ్‌లోనే చూపిస్తామని ఆశిస్తున్నా అని ఈ లెఫ్ట్ హ్యాండర్ అన్నాడు.
భారత ఏ జట్టులో సభ్యుడైన పడిక్కల్ ఆస్ట్రేలియా ఏతో జరిగిన అనధికార టెస్టు మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. పేస్, బౌన్స్‌కు అనుకూలిస్తున్న పిచ్‌ల మీద ఆసీస్ కుర్రాళ్లు రెచ్చిపోతున్నవేళ తన బలమైన ఫుట్‌వర్క్, టెక్నిక్ చూపిస్తూ క్రీజులో నిలబడ్డాడు. దాంతో, అతడిని ఆస్ట్రేలియాలోనే ఉండిపోవాలని బీసీసీఐ చెప్పింది. దాంతో, పడిక్కల్ ఆడడం ఖాయమనే వార్తలు వినిపించాయి.
అయితే.. తుది జట్టుపై అధికారిక ప్రకటన వస్తే ఎవరెవరు ఆడుతున్నారో తెలిసిపోతుంది. ఈ ఏడాది ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన పడిక్కల్ సూపర్ హాఫ్ సెంచరీ కొట్టాడు. ఇంగ్లండ్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 63 పరుగులతో రాణించాడు. అయితే.. ఆ తర్వాత మళ్లీ టెస్టు స్క్వాడ్‌లో పడిక్కల్ కనిపించలేదు.