Cricket | భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆధ్వర్యంలోని క్రికెట్ జట్టును భారత జాతీయ క్రికెట్ జట్టుగా పిలువడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. విచార సందర్భంగా పిటిషనర్‌కు హైకోర్టు చీవాట్లు పెట్టింది. ఇలాంటి పిటిషన్లతో విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయొద్దంటూ హెచ్చరించింది. అయితే, ప్రభుత్వ యాజమాన్యంలోని దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో వంటి సంస్థలు బీసీసీఐ ఆధ్వర్యంలోని భారత జట్టును ‘టీమిండియా’గా పిలువడంపై న్యాయవాది రీపక్ కన్సల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
పిటిషన్‌ను బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావులతో కూడిన ధర్మాసనంపై పిటిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆడుతున్న జట్టును భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం లేదని మీరు చెబుతున్నారా? అని ప్రశ్నించింది. బీసీసీఐని పక్కన పెడితే.. దూరదర్శన్, మరో సంస్థ అయినా టీమిండియా అని పిలిస్తే, చూపిస్తే అది భారత జట్టు కాకుండా పోతుందా? అంటూ ప్రశ్నించింది. క్రీడల్లో ప్రభుత్వ జోక్యం ఉంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో తెలుసా? అంటూ ధర్మాసనం గుర్తుచేసింది. పిల్‌ను విచారించడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని అభిప్రాయపడ్డ కోర్టు.. మంచి అంశాలపై పిల్ దాఖలు చేయాలని సూచించింది.
బీసీసీఐ అనేది తమిళనాడు సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద నమోదైన ఒక ప్రైవేట్ సంస్థ అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 12 ప్రకారం అది ప్రభుత్వం పరిధిలోకి రాదని న్యాయవాది రీపక్ కన్సల్ పిటిషన్లో పేర్కొన్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ సైతం బీసీసీఐని జాతీయ క్రీడా సమాఖ్య (NSF)గా గుర్తించలేదని.. ఈ విషయం ఆర్టీఐ ద్వారా వెలుగులోకి వచ్చిందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ యాజమాన్యంలోని ప్రచార సంస్థలు టీమిండియా, భారత జాతీయ జట్టు అని పిలువడం, జాతీయ జెండాను ఉపయోగించడం చట్టవిరుద్ధమన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ప్రైవేట్ సంస్థకు అనవసరమైన ప్రయోజనం చేకూరుస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. చిహ్నాలు, పేర్ల (అక్రమ వినియోగ నిరోధక) చట్టం-1950, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002ను ఉల్లంఘించడమే అవుతుందని వాదించారు.