ఐపీఎల్లో మరో పోరు అభిమానులను కట్టిపడేసింది. ఆఖరి వరకు గెలుపు దోబూచులాడిన మ్యాచ్ ఫ్యాన్స్‌ను మునివేళ్లపై నిలబెట్టింది. ఆధిక్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో ఆఖరికి రాజస్థాన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయ్యింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమమయ్యాయి. దీంతో విజేతను నిర్ణయించేందుకు జరిగిన సూపర్ ఓవర్లో ఢిల్లీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తంగా ఈసీజన్లో జరిగిన తొలి సూపర్ ఓవర్లో రాజస్థాన్‌పై ఢిల్లీ జయకేతనం ఎగురవేసింది. అలవోకగా గెలువాల్సిన మ్యాచ్‌ను రాజస్థాన్ చేజేతులా వదులుకుని హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది.
IPL | ఢిల్లీ: ఐపీఎల్ మరో పోరు దుమ్మురేపింది! పంజాబ్ కింగ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ లోస్కోరింగ్ మ్యాచ్ అభిమానుల మదిలో నుంచి చెరిగిపోక ముందే ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ పోరు పతాక స్థాయికి తీసుకెళ్లింది. బుధవారం జరిగిన ఈ సీజన్ తొలి సూపర్ ఓవర్ పోరులో రాజస్థాన్‌పై ఢిల్లీ ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ 20 ఓవర్లలో 188/4 స్కోరు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 51, 3ఫోర్లు, 4సిక్స్‌లు), నితీశ్‌రానా(28 బంతుల్లో 51, 6ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో విజృంభించారు. వీరిద్దరు ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఆఖర్లో ధృవ్ జురెల్(17 బంతుల్లో 26, 2సిక్స్‌లు), హెట్‌మైర్(9 బంతుల్లో 15 నాటౌట్, ఫోర్) జట్టును గెలిపించేందుకు చేసిన ప్రయత్నం నెరవేరలేదు. స్టార్క్, అక్షర్, కుల్దీప్ ఒక్కో వికెట్ తీశారు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. అభిషేక్ పొరెల్ (37 బంతుల్లో 49, 5 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 38, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో 20 ఓవర్లలో 188/5 స్కోరు చేసింది. ఆర్చర్(2/32)కు రెండు వికెట్లు దక్కాయి.
జైస్వాల్, రానా రాణించినా:
ఛేదనలో రాయల్స్ ఇన్నింగ్స్ సైతం వేగంగానే ప్రారంభమైంది. శాంసన్ (19 బంతుల్లో 31 రిటైర్డ్ హర్ట్, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జైస్వాల్ దూకుడుగా ఆడారు. ఈ ఇద్దరూ ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముకేశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడారు. ముకేశ్ రెండో ఓవర్లో ఇద్దరూ తలా ఓ సిక్సర్ కొట్టారు. స్టార్క్ 3వ ఓవర్లో జైసాల్.. 4, 6, 4తో 19 రన్స్ రాబట్టాడు. పేసర్లతో లాభం లేదని అక్షర్.. స్పిన్నర్ విప్రాజ్కు బంతినివ్వగా శాంసన్.. ఓ ఫోర్, సిక్సర్‌తో అతడికి స్వాగతం పలికాడు. కానీ అదే ఓవర్లో కట్ షాట్ ఆడే క్రమంలో పక్కటెముకలు పట్టేయడంతో అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. శాంసన్ స్థానంలో వచ్చిన పరాగ్ (8) నిరాశపరిచాడు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసిన జైస్వాల్‌ను కుల్దీప్ ఔట్ చేశాడు. అప్పటికే క్రీజులో కుదురుకున్న రానా..అక్షర్‌పటేల్‌ను లక్ష్యంగా చేసుకుంటూ 15వ ఓవర్లో ఓ భారీ సిక్స్‌కు తోడు రెండు ఫోర్లతో అరుసుకున్నాడు. అయితే రానా నిష్క్రమణతో రాయల్స్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు అవసరం కాగా జురెల్ వికెట్ కోల్పోయిన రాజస్థాన్ 8 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.
అభిషేక్, అక్షర్ మెరుపులు
పొరెల్ మెరుపులతో ఢిల్లీ ఇన్నింగ్స్ ధాటిగానే మొదలైనా పవర్ ప్లేలో రెండు కీలక వికెట్లు కోల్పోయాక ఆ జట్టు స్కోరువేగం నెమ్మదించింది. తుషార్ రెండో ఓవర్లోనే పొరెల్.. 4, 4, 6, 4, 4తో 23 రన్స్ పిండుకున్నాడు. కానీ ఈ సీజన్లో తడబడుతున్న ఫ్రేసర్ మెక్‌గర్క్ (9).. ఆర్చర్ మొదటి ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు బాదినా అతడే వేసిన 3వ ఓవర్లో జైస్వాల్ చేతికి చిక్కడంతో ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడిన కరుణ్ నాయర్.. పొరెల్తో సమన్వయం లోపించి పరుగులేమీ చేయకుండానే రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ పరుగుల వేటలో వెనుకబడింది. రాహుల్ (38).. బంతికో పరుగన్నట్టుగానే ఆడగా ఆరంభంలో రెచ్చిపోయిన పొరెల్ కూడా వేగంగా ఆడలేకపోయాడు. ఆర్చర్ రాహుల్‌ను ఔట్ చేయగా హసరంగ బౌలింగ్‌లో అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో పొరెల్ నిష్క్రమించాడు. అక్షర్ (14 బంతుల్లో 34, 4 సిక్సర్లు, 2 సిక్సర్లు) ఢిల్లీ ఇన్నింగ్స్‌కు ఊపుతెచ్చాడు. హసరంగ ఓవర్లో 4, 4 ,6తో రెచ్చిపోయిన ఢిల్లీ సారథి.. తీక్షణ 16వ ఓవర్లో 6, 4, 4తో అలరించాడు. ఆఖర్లో స్టబ్స్ (34 నాటౌట్), అశుతోశ్ (15 నాటౌట్) ఢిల్లీకి పోరాడే స్కోరునందించారు.
సంక్షిప్త స్కోర్లు
ఢిల్లీ: 20 ఓవర్లలో 188/5 (పొరెల్ 49, రాహుల్ 38, ఆర్చర్ 2/32, హసరంగ 1/38); రాజస్థాన్: 20 ఓవర్లలో 188/4(జైస్వాల్ 51, రానా 51, అక్షర్ 1/23, కుల్దీప్ 1/33)