ముంబై : ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు దక్కింది. బుధవారం జరిగిన కీలక పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం సాధించింది. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ ముంబై..ఢిల్లీని తమ సొంతగడ్డపై మట్టికరిపించింది. మిగతా బ్యాటర్లు విఫలమైనా సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మరో సూపర్ ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌ను ఆదుకున్నాడు. సూర్యతో పాటు తిలక్ వర్మ (27), నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనా సూర్య.. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి ఈ సీజన్లో నాలుగో అర్ధ శతకంతో కదం తొక్కాడు. ఢిల్లీ బౌలర్లు 18వ ఓవర్ దాకా కట్టడిచేసినా చివరి రెండు ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నారు. 181 పరుగుల ఛేదనలో క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకే పరిమితమైంది. సమీర్ రిజ్వి (35 బంతుల్లో 39, 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. శాంట్నర్ (3/11), బుమ్రా(3/12) ఢిల్లీని దెబ్బకొట్టారు.
మొదట బ్యాటింగ్ చేసి 58 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన ముంబైని సూర్య, తిలక్ ఆదుకోకుంటే ఆ జట్టు పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. రోహిత్ (5), రికెల్టన్ (25), జాక్స్ (21) నిరాశపరిచిన చోట సూర్య.. తిలక్ వర్మతో కలిసి అతడు నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. పవర్ ప్లేలో వికెట్లు కోల్పోయినా వేగంగా రన్స్ రాబట్టిన ముంబై.. స్పిన్నర్లు కుల్దీప్, విప్రాజ్ రాకతో నెమ్మదించింది. సూర్య-తిలక్ జోడీ తమ సహజ శైలికి భిన్నంగా ఆడటంతో ఆ జట్టు వంద పరుగుల మార్కును అందుకోవడానికి 14 ఓవర్లు పట్టింది. ఈ క్రమంలో బౌలింగ్ మార్పుగా వచ్చిన ముకేశ్.. తిలక్‌ను ఔట్ చేసి ముంబైని దెబ్బకొట్టాడు. హార్ధిక్ పాండ్యా (3)ను చమీర ఔట్ చేశాడు. 18 ఓవర్లకు ముంబై స్కోరు 132/5 మాత్రమే. కానీ ఆ తర్వాత రెండు ఓవర్లలోనే ముంబై 48 పరుగులు పిండుకుంది. ముకేశ్ 19వ ఓవర్లో తొలి బంతికి సిక్సర్‌తో సూర్య అర్ధ శతకం పూర్తిచేశాడు. మూడో బంతికి స్ట్రైకింగ్ తీసుకున్న నమన్.. 4, 6, 6, 4 బాదడంతో ఆ ఓవర్లో 27 రన్స్ వచ్చాయి. చమీర ఆఖరి ఓవర్లో సూర్య.. 4, 6, 6, 4తో 21 పరుగులు రాబట్టడంతో ముంబై భారీ స్కోరు సాధించింది.
లక్ష్య ఛేదనలో ఢిల్లీ రెండో ఓవర్లోనే తాత్కాలిక సారథి డుప్లెసిస్ (6) వికెట్ కోల్పోయింది. గత మ్యాచ్‌లో శతకంతో చెలరేగి ఆడిన కేఎల్ రాహుల్ (11).. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ రికెల్టన్కు క్యాచ్ ఇచ్చాడు. ఐదో ఓవర్లో పొరెల్ (6)ను రికెల్టన్ రెప్పపాటు తేడాతో స్టంపౌట్ చేయడంతో క్యాపిటల్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. క్రీజులోకి రాగానే 6, 4, 4, 4తో దూకుడుగా ఆడేందుకు యత్నించిన విప్రాజ్ నిగమ్ (20).. శాంట్నర్ బౌలింగ్‌లో అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇక ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకున్న స్టబ్స్ (2)ను బుమ్రా వికెట్ల ముందు బలిగొనడంతో క్యాపిటల్స్ ఓటమి దాదాపు ఖరారైంది. అశుతోష్‌తో కలిసి కొద్దిసేపు మెరుపులు మెరిపించిన సమీర్ రిజ్విని.. శాంట్నర్ ఒకే ఓవర్లో బోల్తా కొట్టించడంతో గెలుపుపై ఢిల్లీ ఆశలు వదులుకుంది. ఇక్కణ్నుంచి ఢిల్లీ మళ్లీ కోలుకోలేదు. ఇదే అదనుగా ముంబై బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. బుమ్రా, సాంట్నర్..ఢిల్లీ పతనాన్ని శాసించారు.
ముంబై: 20 ఓవర్లలో 180/5 (సూర్య 73*, తిలక్ 27, ముకేశ్ 2/48, కుల్దీప్ 1/22);
ఢిల్లీ: 18.2 ఓవర్లలో 121 ఆలౌట్(రిజ్వి 39, నిగమ్ 20, సాంట్నర్ 3/11, బుమ్రా 3/12)