WPL | వడోదర: ఢిల్లీ క్యాపిటల్స్ బంతితో పాటు బ్యాట్‌తోనూ అదరగొట్టడంతో మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ఆ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఇక్కడ యూపీ వారియర్స్‌తో చివరి బంతి వరకూ ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో క్యాపిటల్స్.. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. యూపీ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలుండగానే ఛేదించింది. ఛేదనలో క్యాపిటల్స్ సారథి మెగ్ లానింగ్ (69), అన్నాబెల్ (41 నాటౌట్) మరిజన్నె కాప్ (29 నాటౌట్) దూకుడుగా ఆడారు.
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ.. కిరణ్ నవగిరె (51), శ్వేతా (37), హెన్రీ (33) రాణించడంతో పోరాడగలిగే స్కోరును సాధించింది. ఈ టోర్నీలో యూపీకి ఇది వరుసగా రెండో ఓటమి. కాగా యూపీ, ఢిల్లీ పోరుతో వడోదరలో డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లు ముగిశాయి. శుక్రవారం నుంచి ఈ టోర్నీ బెంగళూరులో మొదలుకానుంది.