ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ఓటమన్నది ఎరుగకుండా దూసుకెళుతున్నది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ను ఢిల్లీ చిత్తుచిత్తుగా ఓడించింది. కుల్దీప్యాదవ్, విప్రాజ్ నిగమ్ స్పిన్ తంత్రంతో ఆర్సీబీ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. సాల్ట్, డేవిడ్ మినహా అందరూ విఫలమయ్యారు. లక్ష్యఛేదనలో 30 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఢిల్లీని ‘లోకల్‌బాయ్’ కేఎల్ రాహుల్ ఒంటిచేత్తో గెలిపించాడు. కొట్టిన పిండిల్లాంటి చిన్నస్వామిలో రాహుల్ అజేయ అర్ధసెంచరీతో జట్టుకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు.
Delhi Capitals | బెంగళూరు: ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ అజేయ ప్రస్థానం కొనసాగుతున్నది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఆర్సీబీపై ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులకే పరిమితమైంది. ఫిల్ సాల్ట్ (17 బంతుల్లో 37, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 37 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. కుల్దీప్ యాదవ్ (2/17), విప్రాజ్ నిగమ్ (2/18) బెంగళూరును కట్టడిచేశారు. అనంతరం ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబాటుకు లోనై వెంటవెంటనే వికెట్లు కోల్పోయినా కేఎల్ రాహుల్ ( 53 బంతుల్లో 93 నాటౌట్, 7ఫోర్లు, 6సిక్స్‌లు) రాణించడంతో లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించింది. స్టబ్స్(38) నాటౌట్‌గా నిలిచాడు. భువనేశ్వర్(2/26)కు రెండు వికెట్లు దక్కాయి. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఆరంభంలో సాల్ట్, ఆఖర్లో డేవిడ్ మెరుపులు లేకుంటే బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. ఇన్నింగ్స్‌ను ఆరంభించిన వేగం చూస్తే మరో భారీ స్కోరు తప్పదేమో అనిపించింది. అక్షర్ రెండో ఓవర్లో కోహ్లీ బౌండరీతో పరుగుల వేటకు శ్రీకారం చుడితే అదే ఓవర్లో సాల్ట్.. 6, 4తో బాదుడుకు గేట్లెత్తాడు. స్టార్క్ 3వ ఓవర్ అయితే వార్ వన్ సైడే. ఆ ఓవర్లో సాల్ట్.. 6, 4, 4, 6, 4తో రెచ్చిపోవడంతో స్టార్క్‌ను ఆటాడుకున్నాడు. నోబాల్ బౌండరీతో కలుపుకుని స్టార్క్ ఓవర్లో ఏకంగా 30 పరుగులు వచ్చి చేరడంతో ఆర్సీబీ 3 ఓవర్లలోనే 53 పరుగులు చేసింది.
ఐపీఎల్లో ఇంత తక్కువ వ్యవధిలో ఫిఫ్టీ రన్స్ మార్కును అందుకోవడం బెంగళూరుకు ఇది రెండోసారి (మొదటిది 2011లో కొచ్చి టస్కర్స్‌పై). అయితే అక్షర్ 4 ఓవర్లో అనవసరపు పరుగుకు యత్నించిన సాల్ట్.. రనౌట్‌గా వెనుదిరిగాడు. అక్కడ్నుంచి ఆర్సీబీ గాడి తప్పింది. పడిక్కల్ (1).. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అక్షర్‌కు క్యాచ్ ఇవ్వగా విప్రాజ్ 7వ ఓవర్లో కోహ్లీ.. స్టార్క్ చేతికి చిక్కాడు. ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్, విప్రాజ్.. బెంగళూరును కట్టడిచేసి కీలక వికెట్లు పడగొట్టారు. లివింగ్స్టన్ (4), జితేశ్ (3)తో పాటు సారథి రజత్ పటీదార్ (25) కూడా నిరాశపరిచాడు. 15వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన డేవిడ్.. తొలి 8 బంతుల్లో చేసినవి 4 పరుగులే. కానీ అక్షర్ 19వ ఓవర్లో 6, 4, 6తో రెచ్చిపోయిన అతడు.. ముకేశ్ వేసిన చివరి ఓవర్లోనూ రెండు సిక్సర్లు, ఓ బౌండరీతో 19 పరుగులు రాబట్టడంతో బెంగళూరు పోరాడగలిగే స్కోరును సాధించింది.
స్వల్ప ఛేదనలో క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబాటుకు లోనైంది. వరుస ఓవర్లలో ఆ జట్టు కీలక వికెట్లను కోల్పోయి ఛేదనను పీకలమీదకు తెచ్చుకుంది. ధయాల్ రెండో ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన డుప్లెసిస్ (2) మిడాఫ్‌లో పటీదార్‌కు క్యాచ్ ఇచ్చాడు. భువనేశ్వర్ వేసిన మరుసటి ఓవర్లో జేక్ ఫ్రేసర్ (7) సైతం అతడినే అనుసరించాడు. 5వ ఓవర్లో భువీ.. ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అభిషేక్ పొరెల్ (7)నూ పెవిలియన్‌కు పంపాడు. కెప్టెన్ అక్షర్ (15) సైతం సుయాశ్ శర్మ 9వ ఓవర్లో లాంగాఫ్‌లో డేవిడ్ చేతికి చిక్కడంతో 58 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది.
బెంగళూరు బౌలర్లు విజృంభణతో సహచర బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుతున్నా రాహుల్ మాత్రం క్రీజులో నిలబడ్డాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పటీదార్ క్యాచ్‌ను వదిలేయడంతో బతికిపోయిన రాహుల్.. అక్షర్, స్టబ్స్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తూ రన్‌రేట్ పడిపోకుండా జాగ్రత్తపడ్డ రాహుల్.. కృనాల్ 12వ ఓవర్లో స్లాగ్ స్వీప్‌తో సిక్సర్ బాది ఇన్నింగ్స్ గేర్ మార్చాడు.
లివింగ్స్టన్ 13వ ఓవర్లోనూ 4, 6తో రెచ్చిపోయిన అతడు.. 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో స్టబ్స్ కూడా చెలరేగడంతో ఆర్సీబీ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. మధ్యలో వర్షం వచ్చి నా..రాహుల్, స్టబ్స్ బౌండరీలు బాదడంతో మరో 13 బంతులుండగానే ఢిల్లీ గెలుపు ఖరారైంది. వీరిద్దరు కలిసి ఐదో వికెట్‌కు 111 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడం మ్యాచ్ గతిని మార్చేసింది.
బెంగళూరు: 20 ఓవర్లలో 163/7 (సాల్ట్ 37, డేవిడ్ 37, కుల్దీప్ 2/17, విప్రాజ్ 2/18)
ఢిల్లీ:17.5 ఓవర్లలో 169/4 (రాహుల్ 93 నాటౌట్, స్టబ్స్ 38 నాటౌట్, భువనేశ్వర్ 2/26, సుయాశ్ 1/25)