ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలుపు ధమాకా కొనసాగుతున్నది. గత సీజన్లకు భిన్నంగా నిలకడ ప్రదర్శిస్తూ సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటుతున్నది. చెన్నై సూపర్‌కింగ్స్‌ను వారి సొంత ఇలాఖాలో మట్టికరిపించిన ఢిల్లీ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తద్వారా 15 ఏండ్ల తర్వాత చెన్నైలో చెన్నైని ఢిల్లీ ఓడించి తమ సుదీర్ఘ కలను సాకారం చేసుకుంది. కేఎల్ రాహుల్, ఇషాన్ పోరెల్ విజృంభణతో పోరాడే స్కోరు అందుకున్న ఢిల్లీ..చెన్నైని కట్టడి చేయడంలో సఫలమైంది. భారీ ఆశల మధ్య బరిలోకి దిగిన ధోనీ..మరోమారు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు.
IPL | చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్ సుదీర్ఘ కల సాకారమైంది. ఏండ్లుగా కొరకరాని కొయ్యగా మారిన చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఎట్టకేలకు ఢిల్లీ చెక్ పెట్టింది. శనివారం చెపాక్‌లో జరిగిన పోరులో ఢిల్లీ 25 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది. 2010 తర్వాత చెపాక్‌లో చెన్నైపై ఢిల్లీకి ఇదే తొలి విజయం కావడం విశేషం. తొలుత కేఎల్ రాహుల్(51 బంతుల్లో 77, 6ఫోర్లు, 3సిక్స్‌లు) సాధికారిక ఇన్నింగ్స్‌కు తోడు ఇషాన్ పోరెల్(33) ఇన్నింగ్స్‌తో ఢిల్లీ 20 ఓవర్లలో 183/6 స్కోరు చేసింది. ఖలీల్ అహ్మద్(2/25) రెండు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 20 ఓవర్లలో 158/5 స్కోరు చేసింది. టాపార్డర్ ఘోరంగా విఫలం కాగా, విజయ్ శంకర్(54 బంతుల్లో 69 నాటౌట్, 5ఫోర్లు, సిక్స్) అజేయ అర్ధసెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. ఆఖర్లో ధోనీ(26 బంతుల్లో 30 నాటౌట్, ఫోర్, సిక్స్) మెరుపులు మెరిపించడంలో విఫలమయ్యాడు. విప్రాజ్ నిగమ్(2/27) రెండు వికెట్లు తీశాడు. రాహుల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచిన ఢిల్లీ అజేయంగా దూసుకెళుతున్నది.
ఢిల్లీకి ఆదిలోనే ఓపెనర్ జేక్ ఫ్రేజర్(0) రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. ఖలీల్ అహ్మద్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఆఖరి బంతికి ఫ్రేజర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ బాధ్యతను రాహుల్, పోరెల్ పంచుకున్నారు. మంచి ఫామ్‌మీదున్న రాహుల్..చెన్నై బౌలింగ్ దీటుగా తిప్పికొడుతూ అద్భుతమైన షాట్లతో అలరించాడు. ఇన్నింగ్స్ గాడిలో పడుతుందన్న తరుణంలో పోరెల్‌ను జడేజా ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆఖర్లో స్టబ్స్(12 బంతుల్లో 24 నాటౌట్, 2ఫోర్లు, సిక్స్) విజృంభణతో ఢిల్లీ మెరుగైన స్కోరు అందుకుంది.
లక్ష్యఛేదనలో చెన్నై ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. టాప్-3 బ్యాటర్లు రవీంద్ర(3), కాన్వె(13), కెప్టెన్ రుతురాజ్(5) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 41 పరుగులకే చెన్నై 3 కీలక వికెట్లు కోల్పోయింది. మిడిలార్డర్లో శంక ర్ ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోయిం ది. ధోనీ మెరుపులు మెరిపించలేకపోయాడు.
Dhoni
చెన్నై సూపర్‌కింగ్స్ దిగ్గజ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ తల్లిదండ్రులు తొలిసారి ఐపీఎల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించారు. శనివారం ఢిల్లీతో చెపాక్‌లో జరిగిన పోరుకు దేవికాదేవి, పాన్‌సింగ్ హాజరయ్యారు. వీరితో పాటు ధోనీ భార్య సాక్షి, కూతురు జివా కూడా స్టాండ్స్‌లో కనిపించారు. తల్లిదండ్రులు మ్యాచ్‌కు రావడంపై ధోనీ రిటైర్మెంట్పై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. ఐపీఎల్‌కు ఇక వీడ్కోలు పలికేందుకు ధోనీ సిద్ధమయ్యాడంటూ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
ఢిల్లీ: 20 ఓవర్లలో 183/6(రాహుల్ 77, పోరెల్ 33, ఖలీల్ 2/25, జడేజా 1/19),
చెన్నై: 20 ఓవర్లలో 158/5(శంకర్ 69 నాటౌట్, ధోనీ 30 నాటౌట్, నిగామ్ 2/27, స్టార్క్ 1/27)