మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో టైటిల్ ఫైట్‌కు వేళయైంది. ఐపీఎల్‌కు ఏమాత్రం తీసిపోకుండా అభిమానులను అలరిస్తున్న అమ్మాయిలు ఆఖరి పోరుకుసై అంటున్నారు. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ టాప్ లేపితే..పడుతూ లేస్తూ సాగిన బెంగళూరు..ముంబైని పడగొట్టి ఫైనల్ చేరింది. లీగ్‌లో తొలిసారి టైటిల్‌ను ముద్దాడాలని చూస్తున్న ఇరు జట్ల మధ్య పోరు అభిమానులకు పసందైన విందు అందించడం ఖాయంగా కనిపిస్తున్నది.
WPL | న్యూఢిల్లీ: డబ్ల్యూపీఎల్‌లో విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. గత 20 రోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న డబ్ల్యూపీఎల్‌లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్(డీసీ), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య ఫైనల్ పోరు జరుగనుంది. లీగ్‌లో ఆది నుంచి తమదైన దూకుడు ప్రదర్శిస్తూ ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేసిన ఢిల్లీ..లీగ్ దశలో టాప్ లేపితే..ఆర్సీబీ ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. ఎనిమిది మ్యాచ్‌ల్లో ఢిల్లీ రెండింటిలో ఓడితే..ఆర్సీబీ నాలుగు గెలిచి, నాలుగింటిలో ఓటమి ఎదుర్కొంది. ఇదిలా ఉంటే ఐపీఎల్లో ఇప్పటి వరకు టైటిల్ గెలువని ఢిల్లీ, ఆర్సీబీ అమ్మాయిల లీగ్‌లోనైనా తమ కల నెరవేర్చుకోవాలని చూస్తున్నాయి. గత లీగ్‌లో ముంబై చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న ఢిల్లీ ఈసారి సొంతగడ్డపై ఆ ముచ్చట తీర్చుకోవాలని చూస్తుంటే..‘ ఈ సాలా కప్ నమదే’ అంటూ ప్రతీ సీజన్లో స్లోగన్ ఎత్తుకునే ఆర్సీబీ కొత్త చరిత్ర నాంది పలుకాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో ఎవరు గెలిచినా మొదటిసారే కావడం అభిమానులకు సంతోషాన్ని ఇవ్వనుంది.
ఢిల్లీ X బెంగళూరు: ఈ సీజన్లో మెగ్ ల్యానింగ్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్మురేపుతున్నది. లీగ్ ఆరంభం నుంచి ప్రత్యర్థి ఎవరన్నది లెక్క చేయని నైజంతో గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్నది. నిరుడు సీజన్లో టైటిల్‌ను ముంబైకి చేజార్చుకున్న ఢిల్లీ.. ఈసారి అలాంటి తప్పు పునరావృతం చేసేందుకు ప్రయత్నించకపోవచ్చు. లీగ్ మొత్తమ్మీద చూసుకుంటే కెప్టెన్ ల్యానింగ్ సూపర్ ఫామ్మీదుంది. ఎనిమిది మ్యాచ్‌ల్లో 308 పరుగులతో ఎలీస్ పెర్రీ(312) తర్వాత రెండో స్థానంలో ఉంది. బౌలింగ్ విషయానికొస్తే డీసీ బౌలర్లు మారిజానె కాప్(11), జెస్ జొనాసెన్(11) టాప్‌గేర్‌లో దూసుకెళుతున్నారు. వీరికి తోడు ఓపెనర్ షెఫాలీవర్మ, జెమీమా రోడ్రిగ్స్ మంచి టచ్‌లో ఉన్నారు.
వీరిలో ఏ ఒక్కరు నిలదొక్కుకున్నా..డీసీ కల నెరవేరినట్లే. బౌలింగ్‌లో శిఖాపాండే, రాధాయాదవ్ రాణిస్తే.. ఢిల్లీకి తిరుగుండదు. ఆర్సీబీని ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ ముందుండి నడిపిస్తున్నది. చివరి లీగ్ మ్యాచ్‌తో పాటు ముంబైతో కీలకమైన ఎలిమినేటర్‌లో పెర్రీ సత్తాచాటింది. అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణిస్తూ ఆర్సీబీని ఫైనల్ చేర్చడంలో కీలకమైంది. ఇదే దూకుడు తుదిపోరులోనూ కొనసాగిస్తే..ఆర్సీబీని అదృ ష్టం వరించినట్లే. కెప్టెన్ మందన, రీచా ఘోష్, శ్రేయాంకా పాటిల్, ఆశా శోభన సత్తాచాటితే ఆర్సీబీ కప్ కల తీరినట్లే. ఈ సీజన్లో బెంగళూరుతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఢిల్లీ గెలువడం కలవర పెట్టే అంశం.
ఢిల్లీ: ల్యానింగ్(కెప్టెన్), షెఫాలీ, క్యాప్సె, రోడ్రిగ్స్, జొనాసెన్, కాప్, మిన్ను మణి, భాటియా, రాధ, అరుంధతి, శిఖాపాండే.
బెంగళూరు: మందన(కెప్టెన్), డివైన్, పెర్రీ, దిశాకసత్/మేఘన, రీచ, మిలోనెక్స్, వేర్హామ్, శ్రేయాంక, రేణుక, ఆశ, శ్రదద్ధే/ఏక్తాబిస్త్.