Ranji Trophy | ముంబై: రంజీ ట్రోఫీ ఫైనల్ పోరులో ముంబైకి విదర్భ దీటుగా బదులిస్తున్నది. ముంబై నిర్దేశించిన 538 పరుగుల భారీ లక్ష్యఛేదనలో విదర్భ నాలుగో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 10/0తో రెండో ఇన్నింగ్స్‌కు విదర్భ..ముంబై బౌలర్లకు పరీక్ష పెట్టింది. కండ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా..వెనుకకు తగ్గకుండా బ్యాటింగ్ కొనసాగించింది.
ఓపెనర్లు అథర్వ(32), ధృవ్షోరె(28) మెరుగైన శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 64 పరుగులు జోడించారు. మిడిలార్డర్లో యశ్రాథోడ్(7) నిరాశపరిచినా..కరణ్నాయర్(74), కెప్టెన్ అక్షయ్ వాడ్కర్(56 నాటౌట్) క్రీజులో పాతుకుపోయారు. 220 బంతులు ఎదుర్కొన్న కరుణ్ తన ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లకు పరిమితమయ్యాడు. ముంబై బౌలర్ల సహనానికి వీరిద్దరు పరీక్ష పెట్టారు. అయితే ముషీర్‌ఖాన్(2/38) కరణ్‌ను ఔట్ చేయడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది.