రాయ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరోసారి ‘టాప్’ లేపే ఆటతో దుమ్మురేపింది. బంతితో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఛేదనలో మొనగాడు విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగిన వేళ.. ఈ సీజన్లో ఆ జట్టు ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్‌కు అడుగుదూరంలో నిలిచింది. కేకేఆర్ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి దంచేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కోహ్లీకి అండగా దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 39, 7 ఫోర్లు) రాణించాడు. తొలుత అంగ్క్రిష్ రఘువంశీ (46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71 ), రింకూ సింగ్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌తో 49 నాటౌట్) రాణించడంతో కోల్‌కతా నిర్ణీత ఓవర్లలో 192/4 స్కోరు చేసింది. వరుసగా నాలుగు విజయాల తర్వాత కేకేఆర్‌కు ఇది తొలి ఓటమి కాగా ఓవరాల్‌గా ఆరో పరాభవంతో ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపుగా వదులుకుంది.
ఛేదనలో బెథెల్ (15) మరోసారి తేలిగ్గానే వికెట్ సమర్పించుకున్నా గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయిన కోహ్లీ.. ఈసారి రెచ్చిపోయి ఆడాడు. వైభవ్ తొలి ఓవర్లోనే నాలుగు బౌండరీలు బాదిన రన్ మెషీన్.. పడిక్కల్ అండగా చెలరేగి ఆడాడు. 21 పరుగుల వద్ద అతడు ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్ వద్ద పావెల్ జారవిడవడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కోహ్లీ.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుస బౌండరీలతో పరుగుల వేటకు దిగిన పడిక్కల్ సైతం బ్యాట్ ఝుళిపిస్తూ బౌండరీలతో రెచ్చిపోగా పది ఓవర్లలో బెంగళూరు 101/1తో సాఫీగా లక్ష్యం వైపుగా సాగింది.
అదే జోరుతో కోహ్లీ.. 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు. అయితే రెండో స్పెల్‌లో బంతినందుకున్న కార్తీక్.. పడిక్కల్‌ను ఆఫ్ కట్టర్‌తో బోల్తా కొట్టించి 59 బంతుల్లోనే 92రన్స్ జోడించిన మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. రజత్ పాటీదార్ (11), టిమ్ డేవిడ్ (2) నిరాశపరిచినా కోహ్లీ మాత్రం రెచ్చిపోయి ఆడాడు. అనుకుల్ ఓవర్లో 4, 6తో 90ల్లోకి వచ్చిన అతడు.. అరోరా 19వో ఓవర్లో సింగిల్‌తో మెగా లీగ్లోరెండేళ్ల తర్వాత మరో సెంచరీని నమోదుచేశాడు. జితేశ్ (8 నాటౌట్)తో కలిసి లాంఛనాన్ని పూర్తిచేశాడు.
నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ ఆటే హైలైట్. ఓపెనర్లు విఫలమైనా పటిష్టమైన బౌలింగ్ లైనప్ కల్గిన బెంగళూరు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కున్న అతడు.. మొదట కామెరాన్ గ్రీన్ (24 బంతుల్లో 32), తర్వాత రింకూతో కలిసి కోల్‌కతాను నిలబెట్టాడు. గత మ్యాచ్‌లో సెంచరీతో రెచ్చిపోయిన అలెన్ (18) డఫీ వేసిన రెండో ఓవర్లో 4, 6, 4తో దూకుడు మీదే కనిపించినా ఆ మరుసటి ఓవర్లోనే భువీ బౌలింగ్‌లో కీపర్ జితేశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
రహానే (19).. మళ్లీ నిరాశపరచడంతో కేకేఆర్ 5 ఓవర్లలో 49/2గా నిలిచింది. ఈ దశలో రఘువంశీ.. గ్రీన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. కృనాల్ ఓవర్లో 6, 4తో గేర్ మార్చాలని చూసిన గ్రీన్‌ను రసిఖ్ 13వ ఓవర్లో క్లీన్‌బౌల్డ్ చేయడంతో 68 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. డఫ్ఫీ బౌలింగ్‌లో సింగిల్‌తో ఈ సీజన్లో నాలుగో అర్ధశతకం సాధించిన రఘువంశీకి రింకూ జతకలవడంతో కేకేఆర్ ఓవర్‌కు పది పరుగులకు తగ్గకుండా రాబట్టి మంచి స్కోరు చేసింది.
14,000 టీ20ల్లో కోహ్లీ 14వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు. వేగంగా (409 ఇన్నింగ్స్) ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు.9
9 ఐపీఎల్లో కోహ్లీకి ఇది అత్యధికంగా తొమ్మిదో సెంచరీ. బట్లర్ 7 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు.
కోల్‌కతా: 20 ఓవర్లకు 192/4 (రఘువంశీ 71, రింకూ 49*, భువనేశ్వర్ 1/34, హేజిల్‌వుడ్ 1/35);
బెంగళూరు: 19.1 ఓవర్లకు 194/4 (కోహ్లీ 105*, పడిక్కల్ 39, త్యాగి 3/32)
