లండన్: డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో దూసుకెళ్తోంది. ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలినా ప్లిస్కోవాకు చెక్ పెట్టి మూడో రౌండ్లో అడుగు పెట్టింది. గురువారం రాత్రి జరిగిన రెండో రౌండ్ పోరులో మూడో సీడ్ పోలాండ్ స్టార్ 6-1, 6-3తో ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను వరుస సెట్లలో చిత్తు చేసింది. తొలి రౌండ్లో టౌన్సెడ్పై నెగ్గేందుకు చెమటోడ్చిన స్వియాటెక్ ఈ మ్యాచ్‌లో అద్భుత షాట్లతో విజృంభించింది. తొలి సెట్లో వరుసగా నాలుగు గేమ్స్ గెలిచి 4-0తో నిలిచిన తర్వాత వెనుదిరిగి చూడకుండా ప్లిస్కోవా పని పట్టింది.
మరో మ్యాచ్‌లో ఆరో సీడ్ అనిసిమోవా (అమెరికా) 6-2, 4-6, 7-6 (10/3)తో తమ దేశానికే చెందిన సోఫియా కెనిన్‌పై పోరాడి గెలిచింది. 12వ సీడ్ మట్రా కోస్త్యుక్ (ఉక్రెయిన్) 6-7 (7/5), 6-3, 6-3తో బ్లింకోవా (రష్యా)ను ఓడించి ముందంజ వేసింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, రెండో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6-1, 6-3, 7-6 (7/3)తో వాలెంటైన్ రోయర్ (ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్ చేరాడు.
సెర్బియా లెజెండ్, ఏడో సీడ్ నొవాక్ జొకోవిచ్ 6-3, 6-4, 6-2తో వరుస సెట్లలో సిట్సిపాస్ (గ్రీస్)ను చిత్తు చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో ఆరో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6-2, 6-2, 7-5 కిప్సన్ (అమెరికా)ను, అలెగ్జాండర్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6-3, 6-2, 6-2తో మనారినో (ఫ్రాన్స్)ను ఓడించారు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు శ్రీరామ్ బాలాజీ, అనిరుధ్ చంద్రశేఖర్, యూకీ భాంబీ జోడీల పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది.