బంజారాహిల్స్,ఆగస్టు 18: సర్ ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించిన ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఉంచడంతో పాటు రాజకీయ పార్టీలకు అందజేసింది. గ్రేటర్ పరిధిలో సుమారు 40శాతం ఓట్లను తొలగించి ముసాయిదాను ప్రచురించారు. ముసాయిదా జాబితాలో కొన్ని పోలింగ్ బూత్స్‌లో కొన్ని ఇండ్లలో అసాధారణంగా ఓటర్లు ఉన్నట్లు ‘నమస్తే తెలంగాణ’ పరిశీలనలో తేలడంతో సర్ ప్రక్రియ తీరుపై అనుమానాలు ప్రారంభమయ్యాయి. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ఓ పోలింగ్ బూత్‌లో ఒకే ఇంటి నంబర్ మీద 44 మంది ఓటర్లు నమోదు కావడం వారిలో ఐదారు మంది మాత్రమే ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న విషయాన్ని స్థానికంగా బీఎల్ఏలుగా పనిచేసిన పార్టీల నేతలతో పాటు స్థానికులు గుర్తించి షాక్‌కు గురయ్యారు.
ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నం 12లోని ఎమ్మెల్యే కాలనీలో పోలింగ్ బూత్ నంబర్ 237లో కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి నివాసం ఎదురుగా ఉన్న జీ ప్లస్ 2 భవనంలో ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యాలయం, కాల్ సెంటర్ నడుస్తోంది. 8-2-684/250 నంబర్ గల ఈ ఇంటి నంబర్ మీద 44 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో పేర్కొనడంతో షాక్ తిన్న స్థానిక నాయకులు ఈ విషయాన్ని గురించి నమస్తే తెలంగాణ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆ ఇంటికి వెళ్లి పరిశీలించగా అక్కడ టచ్‌స్టోన్ ఫౌండేషన్ పేరుతో స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యాలయంతో పాటు కాల్‌సెంటర్ ఉన్నట్లు తేలింది.
ఈ ఇంటి చిరునామా పేరుతో పోలింగ్ బూత్ నంబర్ 237లోని ఓటర్ క్రమసంఖ్య 447 నుంచి ఓటర్ క్రమసంఖ్య 489 దాకా మొత్తం 44మంది ఉన్నట్లు జాబితాలో ప్రచురించారు. వీరిలో కొంతమంది గతంలో ఇక్కడ ఉండేవారని, ప్రస్తుతం ఈ చిరుమానా పేర్కొన్న వారిలో చాలామంది వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారని స్థానికులు తెలిపారు. వీరికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్స్ ఎవరు నింపారు..వాటిని తిరిగి సేకరించిన వారెవరు.. ఇక్కడ లేని వారి దరఖాస్తులను ఎన్నికల అధికారులు ఎలా ఆమోదించారు అనే అంశాలపై స్థానిక బీఎల్ఏలు, నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కాలనీలో ఒకే ఇంటి చిరుమానాతో 43మంది పురుష ఓటర్లతో పాటు ఒక మహిళ ఓటరు ఉన్నట్లు ముసాయిదాలో వెల్లడి కావడంపై మొత్తం ప్రక్రియను లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని నేతలు డిమాండ్ చేస్తున్నారు.